సిఎం కేసీఆర్‌పై జానారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

October 26, 2018


img

కాంగ్రెస్‌ నేత జానారెడ్డికి తీవ్ర ఆగ్రహం కలిగినప్పుడు కూడా ఆయన స్పందన హుందాగానే ఉంటుంది తప్ప ఎన్నడూ మాట తూలరు. అటువంటి వ్యక్తి సిఎం కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌కు నాలుగేళ్ళు అధికారంలో ఉండేసరికి అహంకారం పెరిగిపోయింది. అందుకే ప్రతిపక్ష నేతలపట్ల చాలా అనుచితంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే ఆ అహంకారం ఇంకా ఎక్కువైపోతుంది. ఇంకా నిరంకుశత్వం వస్తుంది. కనుక ఆయన అహంకారం తగ్గాలంటే ఈసారి ఎన్నికలలో ఓడించాల్సిందే. ఆయన నిరంకుశ, అప్రజాస్వామిక పాలనతో విసుగెత్తిపోయున్న ప్రజలు ఆయనకు బుద్ది చెప్పబోతున్నారు. ఈసారి ఎన్నికలలో ఓడిపోతే అప్పుడు తెరాస నేతలందరి లాగులు ఊడిపోతాయి,” అని అన్నారు. 

కేసీఆర్‌ వ్యకిత్వంలో ఉన్న ఈ లోపాన్ని జానారెడ్డి సరిగ్గానే గుర్తించారని చెప్పవచ్చు. సిఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్న మాట వాస్తవం. అలాగే వాటి వలన రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం జరుగుతున్న మాట కూడా వాస్తవం. అయితే సిఎం కేసీఆర్‌ ఆత్మవిశ్వాసంగా భావిస్తున్నది అహంభావంగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అది ఆయన మాటలలో, చేతలలో, నిర్ణయాలలో అడుగడుగునా కనబడుతుంటుంది కూడా. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నేతలను సన్నాసులు, దద్దమ్మలని సంభోదించడం అందుకు ఒక చిన్న ఉదాహరణ. 

కేసీఆర్‌ లో కనిపిస్తున్న ఈ అహంభావమే తెరాస నేతలలో చాలా మందికి విస్తరించడంతో వారు మాటలు, చేతలలో కూడా అది కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు నిత్యం ప్రజల మద్యనే ఉంటారు కనుక వారు అహంభావంతో విర్రవీగితే ఏమవుతుందో తేలికగా ఊహించవచ్చు.    

ఎప్పుడైతే రాజకీయ నేతలలో ఆత్మవిశ్వాసం శృతి మించి అహంభావంగా మారుతుందో అప్పటి నుంచే ప్రజలలో వ్యతిరేకత కూడా క్రమంగా పెరుగుతూ అది ఎన్నికలలో ప్రభావం చూపిస్తుంటుంది. వర్తమాన రాజకీయ చరిత్ర పుటలు తిరగేసి చూస్తే ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు కనిపిస్తాయి. 

సిఎం కేసీఆర్‌ ఆత్మవిశ్వాసంగా భావిస్తున్న అహంభావం కారణంగానే మహాకూటమి ఏర్పడిందని చెప్పక తప్పదు. ప్రజలలో తెరాస పట్ల నెలకొన్న ఆ వ్యతిరేకతను (తెరాస వ్యతిరేక ఓట్లను) వారు తమకు అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నాలు చేస్తుండటమే తెరాసకు ఒక అలారం అని చెప్పవచ్చు. జానారెడ్డి చెప్పినట్లు ఒకవేళ ఇదే కారణంతో తెరాస ఓడిపోయినట్లయితే నాలుగేళ్ళు అనేకమంచి పనులు చేసి ప్రజల తిరస్కారానికి గురైన మొట్టమొదటి పార్టీగా నిలుస్తుంది. కనుక ఒక లోపాన్ని గుణంగా సమర్ధించుకొంటూ ఎదురుదాడి చేయడం కంటే దానిని సకాలంలో గుర్తించి సవరించుకొంటే మంచిది. 


Related Post