కేంద్రంతో యుద్దానికి బాబు సై! రేపు డిల్లీకి

October 26, 2018


img

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై యుద్దం ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనలో కేంద్రం అత్యుత్సాహం చూపడంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న ఆయన రేపు డిల్లీకి వెళ్ళి అక్కడ మధ్యాహ్నం 3 గంటలకు కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించి, తన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి మోడీ సర్కార్ చేస్తున్న కుట్రల గురించి వివరించబోతున్నారు.

బిజెపితో బందం తెంచుకొని ఎన్డీయే ప్రభుత్వం నుంచి టిడిపి బయటకు వచ్చేసినప్పటి నుంచి మోడీ ప్రభుత్వం తన ప్రభుత్వంపై ఏవిధంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదీ ఆయన రేపు జాతీయ మీడియాకు వివరించనున్నారు. అలాగే విభజన హామీలను అమలు చేయకపోవడం, తిత్లీ తుఫానుపై రాష్ట్రానికి ఆర్ధిక సహాయం చేయకపోవడం, రాష్ట్రంలో బిజెపి, జనసేన, వైకాపాలు కలిసి చేస్తున్న కుట్రల గురించి చంద్రబాబు నాయుడు రేపటి మీడియా సమావేశంలో వివరించనున్నారు. 

చంద్రబాబు నాయుడు విజయవాడలో ఎన్నిసార్లు మీడియా సమావేశాలు నిర్వహిచి కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నా, కేంద్రం వైఖరిలో ఎటువంటి మార్పు కనిపించకపోగా ఇంకా కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోందని కనుక డిల్లీ వెళ్ళి మోడీని నేరుగా డ్డీకోనాలని నిర్ణయించుకొన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికల తరువాత లోక్ సభ ఎన్నికలు కూడా జరుగబోతున్నాయి కనుక మోడీని వ్యతిరేకించే రాజకీయ పార్టీలనన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. రేపు సమావేశం ముగిసిన తరువాత డిల్లీలో ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Related Post