మరో తెరాస నేతపై సస్పెన్షన్ వేటు

October 26, 2018


img

రాష్ట్రంలో ఎన్నికల గంట మ్రోగిన తరువాత తెరాస ఎమ్మెల్సీ రాములు నాయక్ పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డారు. తాజాగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందుకు తెరాస నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 

గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే అయిన తనకు తెరాసలో చేరేటప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వకపోవడం, ఈ ఎన్నికలలో శాసనసభకు పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కనుక కాంగ్రెస్ పార్టీ చేరేందుకు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్‌ నేత విజయశాంతిలతో ఆయన రహస్యంగా చర్చలు జరుపుతున్నారు. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు. కనుక మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకోవడంలో ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు. 

ఈవిషయం తెరాసకు తెలియడంతో ఈరోజు ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ పరిణామం ముందే ఊహించిన ఆయన నిన్న సాయంత్రమే తెలంగాణ రోడ్ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. ఆయన త్వరలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. అయితే పొత్తులలో భాగంగా 23 సీట్లను మిత్రపక్షాలకు వదులుకోబోతున్న కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ హామీ ఇస్తుందో లేదో చూడాలి.


Related Post