అది నా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర: చంద్రబాబు

October 26, 2018


img

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై గురువారం వైజాగ్ విమానాశ్రయంలో జరిగిన దాడి సంఘటనతో ఏపీలో వైకాపా-టిడిపి-బిజెపిల మద్య మరో సరికొత్త రాజకీయయుద్దం మొదలైంది. దీనిలో తెరాస పేరు కూడా వినిపించడం విశేషం. 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి నానాటికీ ఏపీ రాష్ట్ర ప్రజలలో ఆధరణ పెరగడం చూసి ఓర్వలేకనే టిడిపి ఈ కుట్రకు పాల్పడి ఉండవచ్చునని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి భద్రత కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని, తమ అధినేతకు జరుగరానిది ఏమైనా జరిగితే దానికి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని వైకాపా ఎమ్మెల్యే రోజా హెచ్చరించారు. 

వైకాపా నేతల ఆరోపణలపై చంద్రబాబు స్పందిస్తూ, “కేంద్ర ప్రభుత్వం కనుసన్నలలో బిజెపి, వైకాపా, జనసేన, తెరాస పార్టీలు కలిసి తన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్రలు పన్నుతున్నాయి. కేంద్ర బలగాల అధీనంలో ఉండే విమానాశ్రయంలో జగన్ పై ఆయన అభిమానే దాడి చేస్తే దానికి మా ప్రభుత్వం ఏవిధంగా బాధ్యత వహిస్తుంది. అయినా జగన్ పై హత్యాప్రయత్నం జరిగిందని ఆరోపిస్తున్నప్పుడు, దాడి జరిగిన తరువాత ఆయన వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయకుండా, స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించుకోకుండా హడావుడిగా హైదరాబాద్‌ ఎందుకు వెళ్ళిపోయారు? 

తిత్లీ తుఫానుతో శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా నష్టపోతే కనీసం ఆ ప్రస్తావన చేయని సిఎం కేసీఆర్‌, మంత్రి కేట్, ఎంపీ కవిత తదితరులు, జగన్మోహన్ రెడ్డికి చిన్న గాయం అయ్యిందని తెలియగానే తక్షణమే స్పందించడాన్ని ఏమనుకోవాలి? జగన్ పై దాడి జరిగిన కొద్ది సేపటికే కేంద్రమంత్రి స్పందించడానికి అర్ధం ఏమిటి? గవర్నర్ నరసింహన్ దీని గురించి నాతో మాట్లాడకుండా నేరుగా రాష్ట్ర డిజిపికి ఫోన్ చేసి దాడికి సంబందించిన వివరాలు కోరడం చూస్తే నా ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కేంద్రప్రభుత్వం కుట్రపన్నుతోందని నటుడు శివాజీ కొన్ని నెలల క్రితం చెప్పిన మాటలు వాస్తవమేనని నమ్మకం కలుగుతోంది. ఈ వంకతో రాష్ట్రంలో అలజడి సృష్టించి, శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయనే సాకుతో నా ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ప్రయత్నించవచ్చునని ఆనాడు శివాజీ ముందే హెచ్చరించాడు. అదే ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ కుట్రకు కేంద్రం తయారుచేసిన స్క్రిప్ట్ ను తెరాస, వైకాపా, జనసేన,బిజెపిలు ఇక్కడ అమలుచేస్తున్నాయి. అయితే ఇటువంటి బెదిరింపులకు, వైకాపా నేతల భూటకపు ఆందోళలకు నేను భయపడబోను. ఈసాకుతో రాష్ట్రంలో ఎవరైనా శాంతిభద్రతలను భంగం చేసే ప్రయత్నాలు చేస్తే వారిని కటినంగా అణచివేస్తాను. 

సుదీర్ఘమైన నా రాజకీయ జీవితంలో అనేక సంక్షోభాలను ఎదుర్కొని బయటపడ్డాను. కేంద్రం, తెరాస, వైకాపా, జనసేన, బిజెపి పార్టీలు కలిసి చేస్తున్న ఈ కుట్రను కూడా నేను చేధిస్తాను. నా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చేస్తున్న కుట్రాలను రాష్ట్ర ప్రజలందరూ నిశితంగా గమనిస్తున్నారనే సంగతి అవి గ్రహిస్తే ఇటువంటి కుట్రలకు సాహసించవు,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.


Related Post