తెలంగాణలో హంగ్ అసెంబ్లీ?

October 25, 2018


img

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయపార్టీలు కొత్త కొత్త వాదనలు వినిపిస్తున్నాయి. తెరాస 100 సీట్లు ఖచ్చితంగా గెలుచుకొంటుందని మొదట చెప్పిన సిఎం కేసీఆర్‌ ఇప్పుడు 110 సీట్లు గెలుచుకొంటుందని నమ్మకంగా చెపుతున్నారు. ఈసారి ఎన్నికలలో తెరాస ప్రభంజనం సృష్టించి దేశచరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పబోతోందని మంత్రి కేటిఆర్‌ చెపుతున్నారు.

శాసనసభ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళడంతో తెరాస గ్రాఫ్ నానాటికీ వేగంగా పడిపోతోందని, మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీ కనీసం 70-75 సీట్లు గెలుచుకోగలమని కాంగ్రెస్‌ నేతలు వాదిస్తున్నారు.

బీసీలకు రాజ్యాధికారం కట్టబెట్టడానికే ఆవిర్భవించిన బిఎల్ఎఫ్ ఈసారి ఎన్నికలలో ప్రభంజనం సృష్టించబోతోందని ఆ కూటమి అధినేత నల్లా సూర్యప్రకాశ్ వాదిస్తున్నారు. కానీ బిఎల్ఎఫ్ కు నేతృత్వం వహిస్తున్న సిపిఎం ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఈసారి రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడబోతోందని చెప్పడం సరికొత్త వాదనే అని చెప్పవచ్చు. 

ఈసారి తెరాస రాష్ట్రంలో 119 స్థానాలకు 110 గెలుచుకోబోతోందని అనేక సర్వేలలో స్పష్టం అయ్యిందని సిఎం కేసీఆర్‌ చెపుతుంటే, రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని తమ్మినేని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల బలాబలాను, సమీకరణాలను, వాటి మద్య ఉండబోయే తీవ్ర పోటీని వాస్తవ దృష్టితో చూసినట్లయితే, తమ్మినేని చెప్పింది జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

తమ్మినేని తన రాజకీయ అనుభవంతో వాస్తవ పరిస్థితులను బట్టి ఈ మాట చెప్పడం బాగానే ఉంది కానీ బిఎల్ఎఫ్ ఓటమిని ఆయన ముందే అంగీకరించినట్లయింది. మొదటి ప్రయత్నంలో కొన్ని సీట్లు గెలుచుకొని శాసనసభలో అడుగుపెట్టగలిగితే చాలని బిఎల్ఎఫ్ భావిస్తున్నట్లు తమ్మినేని మాటలు సూచిస్తున్నాయి. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే బిఎల్ఎఫ్ దానిలో కీలక పాత్ర పోషించి ప్రభుత్వంలో భాగస్వామి అవుతుందని తమ్మినేని చెప్పారు. మరి ఎవరి వాదన నిజమవుతుందో తెలియాలంటే డిసెంబరు 11న ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే. 


Related Post