మొన్న గురువు... నేడు చీడపురుగా?

October 24, 2018


img

తెరాసలో టికెట్ లభించకపోవడంతో బిజెపిలో చేరి మళ్ళీ ఆందోల్ నియోజకవర్గం నుంచి టికెట్ సంపాదించుకొన్న మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్, సిఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. బుదవారం జోగిపేట హౌసింగ్‌ బోర్డు కాలనీలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ తొమ్మిది నెలల ముందుగా ఎన్నికలకు వెళ్ళి తన గొయ్యి తానే తవ్వుకొన్నారు. ఇంతవరకు శరవేగంగా సాగిపోతున్న అభివృద్ధి, సంక్షేమ పనులన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఈ కారణంగా నా నియోజకవర్గంలో మొదలుపెట్టిన పనులను నేను పూర్తి చేయలేకపోయాను. 

సిఎం కేసీఆర్‌ దళితులు, బీసీలు బడుగు బలహీన వర్గాలను మాయమాటలు చెపుతూ మోసం చేస్తూ కాలక్షేపం చేశారు. ఆయన ఈ రాష్ట్రానికి పట్టిన చీడ. ఆ చీడను వదిలించుకొంటే కానీ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగదు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్టీ అధ్యక్షులు వంటి పెద్దపెద్ద పదవులను బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన ఘనత బిజెపికే దక్కుతుంది. కనుక ఈసారి ఎన్నికలలో బిజెపిని గెలిపించాలని ప్రజలను కోరుతున్నాను. ఆంధోల్ నియోజకవర్గం అభివృద్ధికి నేను చాలా కృషి చేశాను. మళ్ళీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తాను,” అని బాబూ మోహన్ అన్నారు.        

పది రోజుల క్రితం బాబూ మోహన్ బిజెపిలో చేరుతున్నప్పుడు, తనకు కేసీఆరే రాజకీయ గురువు అని ఆయన వలననే తాను రాజకీయాలలో గుర్తింపు పొందానని కానీ ఆయన తనకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేసి నడిరోడ్డుపై వదిలేశారని ఆవేధన వ్యక్తం చేశారు. కానీ ఇప్పటికీ కేసీఆర్‌ అంటే తనకు చాలా గౌరవమని అన్నారు. తెరాసలో ఉన్నంత కాలం కేసీఆర్‌లో బాబూ మోహన్ కు ఎటువంటి లోపాలు కనిపించలేదు. కానీ టికెట్ ఇవ్వకపోయేసరికి చీడపురుగైపోయారు. ఒకవేళ టికెట్ ఇచ్చి ఉండి ఉంటే బాబూ మోహన్ ఇప్పుడు ఏమి చెపుతుండేవారో ఊహించుకోవచ్చు. 

 ముందస్తు ఎన్నికల గంట మ్రోగే వరకు రాష్ట్రంలో...తన నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సాగిపోతున్నాయని బాబూ మోహనే స్వయంగా చెప్పారు. అంటే సిఎం కేసీఆర్‌ పాలన బాగుందని ఆయన కూడా భావిస్తున్నారనే కదా అర్ధం? మరి కేసీఆర్‌ను ఎందుకు విమర్శిస్తున్నారు అంటే టికెట్ ఇవ్వనందుకు, పార్టీ మారినందుకేనని చెప్పవచ్చు. 


Related Post