ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు

October 24, 2018


img

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఎం కేసీఆర్‌ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ద్వారా కాంగ్రెస్‌ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో డీఐజీ ప్రభాకర్‌ రావు, నర్సింగరావు, రాదాకిషన్‌ రావు ముగ్గురూ ఉన్నారని ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో తెరాస సమావేశాలు నిర్వహించుకోవడంపై కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 

మహాకూటమిలో సీట్ల సర్దుబాట్ల ప్రక్రియలో జరుగుతున్న ఆలస్యం గురించి ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “రెండు నెలల ముందు అభ్యర్ధులను ప్రకటించడం వలన ఎంతో కొంత నష్టమే తప్ప పార్టీకి ఒరిగేదేమి ఉండదని తెరాసను చూస్తే అర్ధమవుతోంది. ఎన్నికల ప్రచారానికి నెలరోజులు సమయం సరిపోతుంది కనుక మా అభ్యర్ధుల జాబితాలో కొంచెం ఆలస్యం అయినప్పటికీ మాకేమీ నష్టం లేదు. మహాకూటమిలో సీట్ల సర్దుబాట్ల చర్చలు ఒక కొలిక్కి వస్తున్నాయి. కనుక త్వరలోనే అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తాము,” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు కాంగ్రెస్‌ నేతల ఫోన్ ట్యాపింగ్ జరగడం నిజమైతే తెరాసకు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవలసిరావచ్చు. కానీ ఎన్నికలకు ముందు తెరాస అటువంటి దుస్సాహాసం చేస్తుందనుకోలేము. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేశారు కనుక వాటిని నిరూపించవలసిన బాధ్యత కూడా ఆయన మీదే ఉంటుంది. లేకుంటే తెరాసపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆయన ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసిరావచ్చు. గతంలో ఆయనే స్వయంగా ఎన్నికలకు 6 నెలల ముందుగా కాంగ్రెస్ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేస్తామని, తద్వారా వారు ఎన్నికలకు సన్నాహాలు చేసుకోగలుగుతారని చెప్పారు. కానీ ఇప్పుడు మహాకూటమిలో సీట్ల పంపకాలపై జరుగుతున్న ఆలస్యానికి చాలా చక్కగా సర్దిచెప్పుకొన్నారు.


Related Post