కాంగ్రెస్‌ త్యాగాలకు సిద్దం: కుంతియా

October 24, 2018


img

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్-ఛార్జ్ ఆర్.సి.కుంతియా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, “మహాకూటమి కోసం కాంగ్రెస్ పార్టీ త్యాగాలకు సిద్దంగా ఉంది. మా ఉమ్మడి లక్ష్యమైన తెరాసను ఓడించడం కోసం మా పార్టీ త్యాగాలకు వెనుకడాబోదు. మహాకూటమిలో అన్నీ పార్టీలు బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తాయి. ఒకటి రెండు రోజులలోనే మహాకూటమిలో సీట్ల సర్దుబాట్ల చర్చలు ముగియవచ్చు. అవి ముగియగానే మహాకూటమి అభ్యర్ధుల జాబితాను విడుదల చేస్తాము,” అని చెప్పారు.          

మహాకూటమిలో తెలంగాణ జనసమితి, సిపిఐ పార్టీలు డిమాండ్ చేస్తున్నట్లుగా వాటికి సీట్లు కేటాయించాలంటే కాంగ్రెస్ పార్టీ మరికొన్ని సీట్లను త్యాగం చేయడానికి సిద్దపడాలి లేకుంటే ఆ రెండు పార్టీలు బయటకు వెళ్లిపోవచ్చు. అదే జరిగితే మహాకూటమి కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. కనుక కాంగ్రెస్ పార్టీకి ఇంతకు మించి వేరే మార్గం లేదు. అయితే కుంతియా చెప్పినట్లుగా మహాకూటమిని కాపాడటం కోసం త్యాగాలకు సిద్దపడితే, పార్టీలో ఆ సీట్ల కోసం పోటీలు పడుతున్న నేతలు కాంగ్రెస్ పార్టీని త్యాగం చేసి వేరే పార్టీలోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. బహుశః వారికోసమే సిఎం కేసీఆర్‌ తెరాసలో ఇంకా 12 స్థానాలకు అభ్యర్ధుల పేర్లను ప్రకటించకుండా వేచి చూస్తున్నారేమో? కనుక ఈవిషయంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుంది.


Related Post