రాజయ్యను క్షమించాలని కోరుతున్నాను: కడియం

October 23, 2018


img

ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంగళవారం వరంగల్‌ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో తెరాస కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన తీరు కాస్త విచిత్రంగా ఉంది. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి పోటీ చేస్తున్న టి.రాజయ్యకు మద్దతు ఇవ్వాలని చెపుతూనే, మరోపక్క రాజయ్య గాలి తీసేస్తున్నట్లు మాట్లాడటం విశేషం. 

“డాక్టర్ రాజయ్యకు, నాకు మద్య అభిప్రాయాభేదాలున్నాయని కనుక నా వర్గం, ఆయన వర్గం కొట్లాడుకొంటున్నాయని మీడియాలో ఏవేవో వార్తలు వస్తున్నాయి. కానీ మా మద్య చిన్న చిన్న అభిప్రాయభేధాలున్నప్పటికీ, ఇప్పుడు యుద్ధరంగంలో దిగాము కనుక వాటన్నిటినీ పక్కనపెట్టి అందరం కలిసి మన శత్రువుతో యుద్దం చేద్దాం. ఈ మూడున్నరేళ్ళలో నియోజకవర్గం నష్టపోయిన మాట వాస్తవం. కానీ మళ్ళీ రాజయ్యకు ఓటేసి గెలిపిస్తే మేమిద్దరం కలిసి ఆ నష్టాన్ని పూడ్చుతామని నేను హామీ ఇస్తున్నాను. రాజయ్య వలన కొన్ని తప్పులు జరిగాయి కనుక ఆయనను అందరూ క్షమించాలని కోరుతున్నాను. టిడిపిలో ఉన్న నన్ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెరాసలోకి రప్పించి ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి నన్ను ఎంతో గౌరవించారు. కనుక నేను కూడా ఆ గౌరవం నిలుపుకోవడానికి రాజయ్యను భారీ మెజార్టీతో గెలిపించడానికి గట్టిగా కృషి చేస్తాను. ఇది నా ప్రతిష్టకు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టకు సంబందించినదిగా భావించి మీరందరూ రాజయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను,” అని కడియం శ్రీహరి అన్నారు. 

రాజయ్యకు మద్దతు తెలుపుతూనే రాజయ్య వలన తప్పులు జరిగాయని ఆయనను క్షమించాలని కడియం శ్రీహరి చెపుతున్నప్పుడు సభకు విచ్చేసినవారికి రాజయ్య వంగి దండం పెట్టడం తాను తప్పులు చేసినట్లు అంగీకరించినట్లయింది. కడియం శ్రీహరి సభలో ఆయనకు అటువంటి పరిస్థితి కల్పించడం విచిత్రంగానే ఉంది. 

అలాగే గత నాలుగేళ్ళలో తన నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని రాజయ్య చెప్పుకొంటుంటే, మూడేళ్ళలో నియోజకవర్గం చాలా నష్టపోయిందని, కనుక రాజయ్యకు మళ్ళీ ఓటేసి గెలిపిస్తే దానిని తాను సవరిస్తానని కడియం శ్రీహరి సభాముఖంగా చెప్పడం విశేషం. అంటే తెరాస అసమ్మతివాదులు చెపుతున్నట్లుగా గత నాలుగేళ్ళలో రాజయ్య తన నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని భావించాల్సి ఉంటుంది. 

ఇక రాజయ్యపై అవినీతి ఆరోపణలు రావడంతో జనవరి 2015లో ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి, వెంటనే కడియం శ్రీహరికి ఆ పదవిని కట్టబెట్టడం అందరికీ తెలిసిందే. రాజయ్య రాజకీయ జీవితంలో అదొక మరిచిపోలేని చేదు అనుభవం. ఆ సమయంలో ఆయన కడియం శ్రీహరిపై ఎంతగా రగిలిపోయుంటారో వేరే చెప్పనవసరం లేదు. ఇవాళ్ళ రాజయ్యను పక్కను పెట్టుకొని, కేసీఆర్‌ తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి చాలా గౌరవించారని కడియం శ్రీహరి చెపుతున్నప్పుడు రాజయ్య మొహం వాడిపోవడం అందరూ గమనించారు. రాజయ్యకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూనే, రాజయ్య చాలా తప్పులు చేశాడని, ఆయన వలన నియోజకవర్గం చాలా నష్టపోయిందని కడియం శ్రీహరి సభాముఖంగా చెపుతున్నప్పుడు మరి అటువంటి వ్యక్తికి ఎందుకు ఓటేయాలి? అని ప్రజలు సందేహించకుండా ఉంటారా?


Related Post