అప్పుడు కాంగ్రెస్‌...ఇప్పుడు కూటమి

October 23, 2018


img

మహాకూటమిలో సీట్ల సర్దుబాట్లపై కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు కూడా వెనక్కు తగ్గకపోవడంతో చర్చలలో ప్రతిష్టంభన నెలకొంది. దీనిపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం తమ పార్టీ నేతలతో సమావేశమైనప్పుడు వారికి ఒక మంచి సలహా ఇచ్చారు. ఎన్ని సీట్లు సంపాదించుకొన్నామనే దానికంటే ఎన్ని సీట్లు గెలుచుకొన్నామనేదే ముఖ్యమని, కనుక మహాకూటమిని నిలబెట్టి విజయం సాధించడం కోసం అవసరమైతే త్యాగాలకు సిద్దపడాలని చంద్రబాబు నాయుడు సూచించారు.

టిడిపిలో టికెట్ కోసం పోటీలు పడుతున్న నేతలు ఆయన సూచనను పాటిస్తారనుకోలేము. గత ఎన్నికలలో కాంగ్రెస్‌ నేతలు ఈవిధంగానే టికెట్ల, పదవుల కోసం కీచులాడుకొంటూ ఒక మంచి అవకాశాన్ని చేజార్చుకొన్నారు. అప్పుడు ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే కుమ్ములాడుకొంటే, ఇప్పుడు దానికి మరో మూడు పార్టీలు తోడయ్యాయి. కనుక చర్చల పేరిట మహాకూటమిలో భాగస్వాములు సీట్ల కోసం కీచులాడుకొంటున్నాయి. ఒకవేళ ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే 2014లో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన చేదు అనుభవమే మహాకూటమికి ఎదురవడం ఖాయం. కనుక మహాకూటమిలో టిడిపితో సహా అన్ని పార్టీల నేతలు చంద్రబాబు సూచనను పాటించి పట్టువిడుపులు ప్రదర్శిస్తే వారికే మంచిది లేకుంటే వారే నష్టపోతారు. 


Related Post