టికెట్ ఇచ్చి ఉంటే ఇలా మాట్లాడేవారా?

October 20, 2018


img

తెరాసలో టికెట్ ఆశించి భంగపడినవారు కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా తరువాత కేసీఆర్‌, కేటిఆర్‌ బుజ్జగింపులతో చల్లబడి దారికి వస్తున్నారు. కానీ ఎమ్మెల్సీ రాములు నాయక్ వంటి కొందరు నేతలు తెరాసకు గుడ్ బై చెప్పేసి బయటకు వస్తున్నారు. అంటే టికెట్ కోసం వారు ఎంతగా ఆరాటపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఆ అసంతృప్తితో పార్టీ నుంచి బయటకు వచ్చినవారు విమర్శలు చేయడం సహజమే. 

కనుక రాములు నాయక్ కూడా తెరాసపై విమర్శలు గుప్పించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ ప్రకటించిన 105 మంది అభ్యర్ధులలో 70 శాతానికిపైగా గుడ్డి గుర్రాలే. కనుక ఈసారి ఎన్నికలలో తెరాసలో 25-30 మంది గెలిస్తే చాలా గొప్ప విషయమే అవుతుంది. ఈసారి ఎన్నికలలో మంత్రి హరీష్ రావు మాత్రం తప్పకుండా గెలుపొందుతారు కానీ సిఎం కేసీఆర్‌ ఓడిపోవడం ఖాయం. కనుక ఆయన గజ్వేల్ కు బదులు వేరే నియోజకవర్గం చూసుకొంటే మంచిది. గత నాలుగున్నరేళ్లలో మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేసినందుకు ప్రజలు తెరాసను శిక్షించబోతున్నారు. నేను టికెట్ కోసమే కాంగ్రెస్‌ నేతలను కలిశానని తెరాస నేతలు చేస్తున్న ఆరోపలను ఖండిస్తున్నాను. ఈసారి ఎన్నికలలో నేను ఏ పార్టీ తరపునా పోటీ చేయాలనుకోవడం లేదు. ఒకవేళ పోటీ చేయదలిస్తే స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తాను,” అని అన్నారు. 

టికెట్ లభించనందుకే రాములు నాయక్ తెరాసపై తిరుగుబాటుకు సిద్దం అవడంతో తెరాస ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఒకవేళ ఆయనకు టికెట్ లభించి ఉండి ఉంటే నేడు తెరాసను వెనకేసుకువస్తూ మాట్లాడి ఉండేవారని వేరే చెప్పకరలేదు. తెరాసలో స్వేచ్చ, ఆత్మగౌరవం, అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ఇప్పుడు ఆరోపణలు గుప్పిస్తున్న రాములు నాయక్ గత 20 ఏళ్లుగా తెరాసలోనే ఉన్నారు. అప్పుడు కనబడని ఈ లోపాలు, సమస్యలు ఇప్పుడే ఎందుకు కనబడుతున్నాయి? అంటే టికెట్ ఇవ్వనందుకు... ఆ కారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చినందునేనని వేరే చెప్పక్కరలేదు.


Related Post