రేవంత్‌రెడ్డిపై బిజెపి ఎంపీ తీవ్ర విమర్శలు

October 20, 2018


img

ఏపీలో టిడిపి-బిజెపి బందం తెగిపోయిన తరువాత రంగంలోకి దిగిన బిజెపి ఎంపీ జీవిఎల్ నరసింహరావు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలను, ఏపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని తరచూ విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిపై కూడా తన అస్త్రశస్త్రాలు సందించడం ఆలోచింపజేస్తోంది. 

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రేవంత్‌రెడ్డి ఒక రాజకీయ నాయకుడి లక్షణాల కంటే భూకబ్జాలు, సెటిల్మెంట్లు చేసే ఒక రౌడీలాగ వ్యవహరిస్తున్నారు. అంతేగాక కేఎల్‌ఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ అనే బినామీ సంస్థ పేరుతో చేయని పనులు అనేకం చేసినట్లు, ఆ పనులు చేసినందుకు పనివారికి భారీగా జీతాలు చెల్లించినట్లు దొంగ లెక్కలు చూపినట్లు ఆదాయపన్ను శాఖ అధికారుల దాడులలో బయటపడింది. రేవంత్‌రెడ్డి మామ వద్ద నుంచి 1.2 కేజీల బంగారం, 11 లక్షల నగదు, రేవంత్‌రెడ్డి బావమరిది, సోదరుడు, వారి అనుచరుల వద్ద నుంచి వారి అవినీతి, అక్రమాలను నిరూపించే అనేక కీలకమైన పత్రాలను ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకొన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈవిధంగా అక్రమంగా సంపాదించిన సొమ్ముతోనే రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎమ్మెల్యేను కొనేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. అయితే రేవంత్‌రెడ్డి ఆస్తులు, అక్రమార్జనలో ఇప్పటి వరకు బయటపడింది చాలా చిన్న మొత్తమే. త్వరలోనే ఆదాయపన్ను శాఖ మరిన్ని వివరాలు బయటపెడుతుందని భావిస్తున్నాము,” అని అన్నారు. 

ఆ తరువాత జీవిఎల్ నరసింహరావు కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీపై కూడా అవినీతి ఆరోపణలు చేశారు. కానీ తెరాసను పల్లెత్తు మాటనకపోవడం విచిత్రం. రాష్ట్ర బిజెపి నేతలు తెరాసను, సిఎం కేసీఆర్‌ను విమర్శిస్తున్నప్పటికీ ఆ విమర్శలలో కాంగ్రెస్‌కున్న కసి, కోపం కానరాదు. తెరాస-బిజెపి మద్య రహస్య అవగాహన ఉన్నందున దానికి తోడ్పడేందుకే జీవిఎల్ నరసింహరావు రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది. రేవంత్‌రెడ్డి, ఆయన బందువులు, సన్నిహితుల ఇళ్ళు, కార్యాలయాలలో సోదాలు నిర్వహించి, విచారణ చేసిన ఆదాయపన్ను శాఖ అధికారులు ఇంతవరకు అధికారికంగా ఏమీ చెప్పకపోయినా, మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా జీవిఎల్ నరసింహరావు పనిగట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం ఆయనపై బురద జల్లి అప్రదిష్టపాలు చేయడానికేననిపిస్తోంది. వీటిపై రేవంత్‌రెడ్డి ఏవిదంగా స్పందిస్తారో చూడాలి. 


Related Post