కృష్ణయ్య కాంగ్రెస్‌లో చేరబోతున్నారా?

October 19, 2018


img

బీసీ సంఘం నేత ఆర్‌. కృష్ణయ్య గత ఎన్నికలకు ముందు టిడిపిలో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో బీసీలను ఆకట్టుకోవడానికే చంద్రబాబు నాయుడు ఆయనను ఎన్నికలకు ముందు పార్టీలోకి రప్పించి, టిడిపి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించారు. కృష్ణయ్య గెలిచినప్పటికీ, రాష్ట్రంలో టిడిపిని అధికారంలోకి తీసుకురావాలనే చంద్రబాబు నాయుడు ఆలోచన ఫలించలేదు. ఎన్నికలలో ఓడిపోయిన తరువాత ఏమి జరిగిందో అందరికీ తెలుసు. అప్పటి నుంచి టిడిపికి దూరమైన ఆర్. కృష్ణయ్య ఈసారి కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారు. 

బీసీలకు రాజ్యాధికారంలో భాగం కల్పించడానికి ఏ పార్టీ అంగీకరిస్తే దానికే తాము మద్దతు పలుకుతామని చెప్పారు. తనతో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తదితరులు మాట్లాడుతున్నారని ఆయనే స్వయంగా చెప్పారు. ఇవాళ్ళ ఆయనే స్వయంగా సీనియర్ కాంగ్రెస్‌ నేత జానారెడ్డితో భేటీ అయ్యారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “బీసీల సంక్షేమం కోసం కృష్ణయ్య చేసిన ప్రతిపాధనలను పరిశీలించి వాటిలో ఆచరణ సాధ్యమైనవాటిని మా పార్టీ మేనిఫెస్టోలో చేర్చుతాము. మా పార్టీ బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉంది,” అని జానారెడ్డి అన్నారు. 

“చట్ట సభలలో బీసీలకు రిజర్వేషన్లు, బీసీ సబ్‌ప్లాన్‌, బీసీలకు 90 శాతం సబ్సిడీతో రుణాలు, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని నేను కోరాను. జానారెడ్డిగారు అందుకు సానుకూలంగా స్పందించారు,” అని ఆర్.కృష్ణయ్య అన్నారు. 

చట్టసభలలో బీసీలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్న ఆర్.కృష్ణయ్య, ఇప్పుడు జరుగబోతున్న ఎన్నికలలోనే కాంగ్రెస్ పార్టీ బీసీలకు 30 శాతం సీట్లు కేటాయించాలని పట్టుపట్టకపోవడం ఆలోచించవలసిన విషయమే. ఆయన కాంగ్రెస్‌ టికెట్ కోసమే ఆ పార్టీతో రాజీపడుతున్నారా? అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే, బీసీలకు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా ఏర్పాటు అయిన బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్ ఈ ఎన్నికలలో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయిస్తానని ప్రకటించింది. కానీ కృష్ణయ్య ఆ కూటమికి మద్దతు పలుకకుండా, బీసీలకు ఎన్ని సీట్లు కేటాయిస్తుందో నిర్ధిష్టంగా చెప్పని కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారు. కనుక ఆయన టికెట్ కోసమే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడానికి సిద్దం అవుతున్నారా? అనే అనుమానం కలగడం సహజం. 



Related Post