ఎన్నికలు బహిష్కరిస్తే పరిపాలన ఎలాగ?

October 18, 2018


img

డిసెంబరు 7న జరుగబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలను కోరుతూ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్‌ పేరుతో మీడియాకు ఒక లేఖ అందింది. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునివ్వడం కొత్తేమీ కాదు. కానీ ఈసారి రాష్ట్రంలో టిజేఎస్, వామపక్షాలతో సహా అన్నీ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించడమే విశేషం. అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయి కనుక ఎన్నికలను బహిష్కరించమని కోరిన మావోయిస్టులు మరి ఏ పార్టీని ఎన్నుకోకపోతే రాష్ట్రంలో పరిపాలన ఏవిధంగా సాగుతుంది?అని ఆలోచించకపోవడం విడ్డూరంగా ఉంది. బహుశః ప్రజలందరూ కూడా తమలాగే తుపాకులు పట్టుకొని అడవులలో నివసించాలనుకొంటున్నారా లేక వారే ప్రజలలోకి వచ్చి రాష్ట్రాన్ని పరిపాలిస్తారో చెప్పి ఉంటే బాగుండేది. 

చిరకాలం మావోయిస్టుల సానుభూతిపరుడిగా కొనసాగిన గద్దర్, ఆ విప్లవపంధా వలన ప్రయోజనం లేదని గ్రహించి, గత రెండేళ్ళుగా రాజ్యాంగ పుస్తకం చేతపట్టుకొని దాని గురించి, ప్రజాస్వామ్య విలువల గురించి ప్రచారం చేస్తుండటం గమనిస్తే మావోయిస్టుల పోరాటాలతో దేశంలో ఎటువంటి మార్పు రాదని, దేశానికి ప్రజాస్వామ్యమే శరణ్యమని స్పష్టం అవుతోంది. అలాగే చిరకాలం తుపాకులు పట్టుకొని పోరాడిన అనేకమంది మావోయిస్టులు కూడా చివరికి ఆరోగ్యసమస్యలు ముదిరిపోయినప్పుడు వచ్చి పోలీసులకు లొంగిపోయి జనజీవనస్రవంతిలో కలుస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

కనుక మావోయిస్టులకు దేశభక్తి, మాతృభూమిపై, బడుగుబలహీన వర్గాల ప్రజల పట్ల ప్రేమాభిమానాలు ఉన్నట్లయితే వారు కూడా ఒక రాజకీయ పార్టీతో ప్రజల ముందుకు వచ్చి మన ప్రజాస్వామ్య విధానాలలో ఉన్న లోపాలను సవరించే ప్రయత్నాలు చేయాలి కానీ ప్రజాస్వామ్యవ్యవస్థనే వద్దనడం సరికాదు. ఒకవేళ ఆవిదంగా అనుకొంటే అది ఇంట్లో ఎలుక దూరిందని ఇంటికి నిప్పు అంటించుకోవడంగానే భావించాల్సి వస్తుంది. 


Related Post