అది కాపీ కొట్టడమేనా?

October 17, 2018


img
సిఎం కేసీఆర్‌ నిన్న ప్రకటించిన తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని ముఖ్యాంశాలు కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో కాపీ కొట్టినవేనని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాదించారు. అది నిజమే కావచ్చు. కానీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా అన్నీ పార్టీలు పోరాడుతున్నప్పుడు చేతికి అందిన ప్రతీ అవకాశాన్ని, ఆయుధాన్ని ఉపయోగించుకోవాలనుకోవడం సహజం. తెరాస కూడా అదే చేసింది.

ఎన్నికలలో గెలిచేందుకు ఒక పార్టీ ఆకర్షణీయమైన హామీ ఇస్తే, దాని ప్రత్యర్ధులు కూడా తప్పనిసరిగా అంతకంటే ఆకర్షణీయమైన లేదా అటువంటి హామీనే ఈయక తప్పదు. ఇవ్వకపోతే ఏమవుతుందో గత ఎన్నికలలో ఏపీలో వైకాపాను చూస్తే అర్ధం అవుతుంది. అందుకే ఈసారి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏడాది ముందుగానే పాదయాత్ర చేస్తూ ‘నవరత్నాలు’ పేరిట ప్రజలకు ఎన్నికల హామీలను గుప్పిస్తున్నారు.

ఇక టి-కాంగ్రెస్‌ హామీలలో సాధ్యాసాధ్యాలను పక్కనపెడితే అవి ప్రజలను చాలా ఆకట్టుకొనేవిదంగా ఉన్నాయి కనుక తెరాస కూడా ఇంచుమించు అవే హామీలను ప్రకటించక తప్పలేదు. దానిని ఎన్నికల వ్యూహంలో భాగంగానే చూడాలి తప్ప ఓటమి భయంతో ప్రకటించినట్లు భావించరాదు. కానీ తెరాస మేనిఫెస్టోపై కాంగ్రెస్‌ మేనిఫెస్టో ప్రభావం పడిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒకవేళ తెరాస మేనిఫెస్టోలో ప్రజలను ఆకట్టుకొనే హామీలున్నట్లయితే, కాంగ్రెస్ పార్టీతో సహా ఇతరపార్టీలు కూడా వాటిని కాపీ కొట్టకుండా ఊరుకోవు. మన రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలపై ‘కాపీ రైట్’ హక్కుల కోసం ఇంతవరకు కోర్టులకు వెళ్ళలేదు కనుక ఎవరూ దీనిని తీవ్ర నేరంగా భావించడం లేదు. కానీ కాంగ్రెస్‌ హామీలను తెరాస మేనిఫెస్టోలో చేర్చడం ద్వారా సిఎం కేసీఆర్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు తనను, తెరాసను విమర్శించేందుకు ఒక మంచి అవకాశం కల్పించారని చెప్పక తప్పదు.

Related Post