తెరాసకు ఎప్పుడూ ఎన్నికలు ఒక టాస్క్!

October 17, 2018


img

‘ఎన్నికలంటే మాకు గేమ్ కాదు ఒక టాస్క్,’ అని సిఎం కేసీఆర్‌ చెప్పిన మాట నూటికి నూరు శాతం నిజమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో జరిగిన ప్రతీ ఎన్నికలను ‘సర్జికల్ స్ట్రైక్స్‘ అంత పకడ్బందీగా వ్యూహాలు, ఏర్పాట్లు చేసుకొని రంగంలో దిగి విజయం సాధిస్తోంది తెరాస. సిఎం కేసీఆర్‌ ఎన్నికలను ఒక టాస్క్ లేదా ఆపరేషన్ గా భావిస్తున్న కారణంగానే, పరిస్థితులను బేరీజు వేసుకొని అన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని నిర్ధారించుకొని 9 నెలల ముందుగానే శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళుతున్నారు. కనుక ఈ ఎన్నికలు తెరాసకు ఖచ్చితంగా ఒక టాస్క్ అనే చెప్పవచ్చు. 

అయితే సిఎం కేసీఆర్‌ చెప్పినట్లు ప్రతిపక్ష పార్టీలకు ఈ ఎన్నికలు గేమ్ కాదు. ఈ ఎన్నికలు వాటికి జీవన్మరణ సమస్య వంటివి కనుక ఎన్నికలలో గెలవడం వాటికీ ఒక టాస్క్ అనే చెప్పవచ్చు. ఈ టాస్క్ ను విజయవంతంగా పూర్తి చేయడానికే అన్ని పార్టీలు ప్రజలను ఆకర్షించేందుకు మేనిఫెస్టోలో ఆకర్షణీయమైన హామీలు ఇస్తున్నాయి. తెరాస కూడా సరిగ్గా అదే చేస్తున్నప్పటికీ ‘మాకు మాత్రమే చిత్తశుద్ది ఉందనే’ రీతిలో సిఎం కేసీఆర్‌ నిన్న మాట్లాడారు. అంటే ‘మేము చేస్తే సంసారం..అదే ఇతరులు చేస్తే వ్యభిచారం’ అన్నట్లుంది. 

సిఎం కేసీఆర్‌ నిన్న ప్రకటించిన తెరాస మేనిఫెస్టోలో నిరుద్యోగభృతి, పెన్షన్ మొత్తాల పెంపు, ఇళ్ళ నిర్మాణం, ఒకేసారి పంటరుణాల మాఫీ వంటివి కాంగ్రెస్ ప్రకటించిన హామీలేనని అందరికీ తెలుసు. నిన్న మొన్నటి వరకు అవి ఆచరణ సాధ్యం కావని, వాటిని అమలుచేయాలంటే దక్షిణాది రాష్ట్రాలన్నిటి ఆదాయం కలిపి ఖర్చు చేసినా సరిపోదని మంత్రి కేటిఆర్‌ పదేపదే ఎద్దేవా చేయడం అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నిరుద్యోగ భృతికి తెరాస మరో రూ.16 కలిపి రూ.3,016 ఇస్తామంటోంది. అలాగే పంటరుణాలను ఒకటిరెండు విడతలలోనే చెల్లిస్తామని కొత్తగా హామీ ఇస్తోంది. పెన్షన్ల మొత్తం పెంపు కూడా కాంగ్రెస్‌ హామీ ప్రభావమేనని అర్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఆకట్టుకొని ఎన్నికలలో గెలిచేందుకే ఆచరణ సాధ్యం కాని ఈ హామీలన్నీ ప్రకటించిందని ఇంతవరకు వాదించిన తెరాస కూడా ఇప్పుడు ఇంచుమించు అవే హామీలను లేదా అంతకంటే మరికాస్త అదనంగా, ఆకర్షణీయంగా హామీలను ప్రకటించడాన్ని ఏమనుకోవాలి?ప్రజలను ఆకట్టుకొని ఎన్నికలలో గెలవడం కోసమే కదా? ప్రతిపక్ష పార్టీలు ఏమి చేస్తున్నాయో తెరాస కూడా అదే చేస్తూ మళ్ళీ వాటిని తప్పుపట్టడం ఎందుకు? 

ఎన్నికలంటే తెరాసకే కాదు...దేశంలో ఏ పార్టీకైనా ఒక పెద్ద టాస్క్ వంటివే. వాటిలో గెలవడం కోసమే ఈ మేనిఫెస్టోలు ఆకర్షణీయమైన హామీలని అందరికీ తెలుసు. అయితే వాటిలో ఏ పార్టీ మేనిఫెస్టోలో హామీలు ఆచరణ సాధ్యమైనవి? ఏ పార్టీకి ఎంత నిజాయితీ ఉంది? ఏది వాటిని అమలుచేయగలదు? అని ప్రజలు నిర్ణయించుకొంటారు తప్ప పార్టీలు కాదు. తమ హామీలలో నిజాయితీ కూడినవని, వాటిని తప్పకుండా అమలుచేస్తామని ప్రజలను నమ్మింపజేసేందుకు అన్ని పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తుంటాయి. నిన్న సిఎం కేసీఆర్‌ కూడా అదే చేశారని చెప్పవచ్చు.


Related Post