ఇదీ తెరాస ఎన్నికల మేనిఫెస్టో

October 16, 2018


img

ఒకప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలపై ప్రజలకు అంతా ఆసక్తి ఉండేది కాదు. ఎందుకంటే దానిలో ఇచ్చిన ఆకర్షణీయమైన హామీలు ఎన్నికలలో ప్రజలను మభ్యపెట్టడానికే తప్ప అమలుకు నోచుకోవని ప్రజాభిప్రాయం. అది నిజం కూడా. కానీ ఇప్పుడు ప్రజలు రాజకీయంగా చాలా చైతన్యం గా ఉన్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీలు, మీడియా, సోషల్ మీడియా అన్నీ పాలకులను నిలదీసి అడుగుతున్నాయి. కనుక ఇప్పుడు రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలను ప్రకటించే ముందే వాటిలో ఇస్తున్న హామీల గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవలసి వస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో అందరి దృష్టి తెరాస ప్రకటించబోయే ఎన్నికల మేనిఫెస్టోపైనే ఉందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే, ఆ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉండటం, ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వస్తే అది మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలుచేస్తుందనే నమ్మకం ప్రజలకు కలిగి ఉండటమేని చెప్పవచ్చు. సిఎం కేసీఆర్‌ మంగళవారం సాయంత్రం తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని ముఖ్యాంశాలను వివరించారు. అవేమిటో ఓ లుక్ వేద్దామా?

1. మళ్ళీ లక్ష రూపాయలు రుణమాఫీ. ఈసారి ఒకటి లేదా రెండు విడతలోనే పూర్తిగా రుణమాఫీ.

2. రైతు బంధు పథకంలో ప్రస్తుతం ఏడాదికి ఎకరానికి రెండు పంటలకు కలిపి రూ.8,000 ఇస్తున్నాము. దానిని ఎకరానికి మరో రూ.1000 కలిపి ఏడాదికి రూ. 10,000 ఇస్తాము. 

3. ఆసరా పెన్షన్ల వయో పరిమితిని 65 నుంచి 57 ఏళ్ళకు తగ్గిస్తాము. వృద్ధులకు ప్రస్తుతం నెలకు రూ.1,000 పెన్షన్ ఇస్తున్నాము. దానిని రూ.2,016కు పెంచుతాము. అదేవిధంగా వికలాంగులకు రూ.1,500 నుంచి రూ.3,016కు పెంచుతాం.

4. నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,016 ఇస్తాం. రాష్ట్రంలో ఎంతమంది అర్హులైన నిరుద్యోగులు ఉన్నారో వారిని గుర్తించడం కొంచెం క్లిష్టమైన ప్రక్రియ. కనుక మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినప్పుడు దానికి అవసరమైన విధివిధానాలు, మార్గదర్శకాలు అన్నీ రూపొందించి రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉంటే అందరికీ ఈ నిరుద్యోగ భృతిని అందిస్తాము.  

5. సొంత స్థలం ఉన్నవారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించి ఇస్తాము. 

6. అగ్రవర్ణ పేదల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాము. 

 7. ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒకటి చొప్పున ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యునిట్‌లు ఏర్పాటు చేసి, వాటి నిర్వహణ బాధ్యతను ఐకేపీ మహిళా సంఘాలకు అప్పగిస్తాము. 

8. రైతు సమన్వయ సమితులకు గౌరవ వేతనం అందిస్తాం. 

9. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పథకాలను రూపొందిస్తాము.


Related Post