జైపాల్ రెడ్డికి మంత్రి హరీష్ కౌంటర్

October 16, 2018


img

కాంగ్రెస్‌ సీనియర్ నేత జైపాల్ రెడ్డి నిన్న సిఎం కేసీఆర్‌, తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలపై చేసిన తీవ్ర అవినీతి ఆరోపణలకు రాష్ట్ర సాగునీటిశాఖా మంత్రి హరీష్ రావు చాలా ఘాటుగా బదులిచ్చారు. 

ఈరోజు తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “సీనియర్ రాజకీయ నాయకుడైన జైపాల్ రెడ్డి నిన్న మాగురించి ఆవిధంగా మాట్లాడటం సిగ్గుచేటు. ఆయన కేంద్రంలో చాలా కాలం చక్రం తిప్పినప్పటికీ, తాను పుట్టిపెరిగిన మహబూబ్ నగర్ జిల్లాకు, కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక ఎకరాకు నీళ్ళు పారించలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళలో చేయలేని పనిని మా ప్రభుత్వం నాలుగేళ్ళలో చేసి చూపించింది. మా ప్రభుత్వం వచ్చాకే ఆయన జిల్లాలో 8 లక్షల ఎకరాలకు నీళ్ళు పారుతున్నాయి. నీళ్ళెక్కడ? నల్లాలెక్కడ? అని ప్రశ్నిస్తున్న ఆయనను చూసి నవ్వాలో ఎడ్వాలో తెలియడం లేదు. ఆయన మాటలు విని మహబూబ్ నగర్ జిల్లాలో ఆ నీటిని ఉపయోగించుకొంటున్న రైతులు, ప్రజలు నవ్వుకొంటున్నారు. ఆయన ఒకసారి వనపర్తి, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, జడ్చెర్ల తదితర ప్రాంతాలలో పర్యటిస్తే అక్కడ ఎన్ని ఎకరాలకు నీళ్ళు పారుతున్నాయో, ఎన్ని వేల ఇళ్లలో నల్లాలలో నీళ్ళు వస్తున్నాయో చూడవచ్చు. 

 సాగునీటిపై కాంగ్రెస్‌ నేతలు ఎంత లోతుగా చర్చిస్తే అంతా మాకే మేలు చేసినవారవుతారు. ఈవిధంగానైనా తెలంగాణ రాష్ట్రానికి, రైతులకు కాంగ్రెస్‌ ఏమి చేసింది? తెరాస ఏమి చేసిందనే విషయాలు ప్రజలకు తెలుస్తాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం 10 ఏళ్లలో రాష్ట్రంలో 4 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తే మా ప్రభుత్వం నాలుగేళ్ళలో 25 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించింది. ఇదే మీకు మాకు ఉన్న తేడా,” అని హరీష్ రావు అన్నారు. 

“ఇక ప్రాజెక్టులలో అవినీతి, ఆంధ్రా కాంట్రాక్టర్లకు వేలకోట్ల పనులు అప్పజెప్పామంటూ జైపాల్ రెడ్డి మాపై ఏవేవో ఆరోపణలు చేశారు. అసలు అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీయే కదా! ఈపీసీ, సర్వే డిజైనింగ్, మొబిలైజేషన్ అడ్వాన్సులు అంటూ అవినీతి కార్యక్రమాలను ప్రారంభించింది మీ పార్టీయే కదా? ఆ పేరుతో పనులు చేయకుండానే కాంట్రాక్టర్లకు మీ కాంగ్రెస్‌ ప్రభుత్వం వేలకోట్లు కట్టబెట్టలేదా?జలయజ్నం పేరుతో ధనయజ్నం చేస్తున్నారని ఇప్పటి మీ జిగిరీ దోస్త్ చంద్రబాబు నాయుడు ఆనాడు పుస్తకాలు కూడా ముద్రించి దేశమంతా పంచిపెట్టిన సంగతి మరిచిపోయారా? ఆనాడు మీ రాజశేఖర్ రెడ్డి ఇదే ఆంధ్రా కాంట్రాక్టర్లకు ‘నవరత్నాలు’ అంటూ హోదా కల్పించినప్పుడు మీరేందుకు మాట్లాడలేదు? ఆ నవరత్నాలను మీ కాంగ్రెస్ ప్రభుత్వమే పెంచిపోషించిన  సంగతి మరిచిపోయారా?” అని ప్రశ్నించారు. 

“జాతీయస్థాయిలో అనుసరిస్తున్న ఈ-ప్రొక్యూర్ మెంట్ పద్దతిలో అత్యంత పారదర్శకంగా పనులు అప్పగిస్తే, మీరేమో వేలకోట్లు అవినీతి జరిగిపోయిందని అబద్దాలు చెప్పడం సరికాదు. కాంగ్రెస్ పార్టీలో మిమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదని, సిఎం రేసులో మీరున్నారని చెప్పుకోవడం కోసం, మీడియాలో ఫ్రంట్ పేజీ కవరేజి కోసమే ఈవిధంగా నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేస్తే ప్రజలే మీకు, మీ పార్టీకి తగినవిధంగా బుద్ధి చెపుతారు,” అని మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. 


Related Post