జి వినోద్ మళ్ళీ కాంగ్రెస్‌ గూటికే

October 16, 2018


img

దివంగత మాజీ కేంద్ర మంత్రి జి.వెంకటస్వామి తనయుడు జి.వినోద్‌ త్వరలో మళ్ళీ కాంగ్రెస్‌ గూటికి చేరుకోబోతున్నారు. తెలంగాణ ఉద్యమాలు పతాకస్థాయికి చేరుకొన్నప్పుడు ఆయన తన సోదరుడు వివేక్ తో కలిసి 2013 జూన్‌ 2న తెరాసలో చేరారు. ఆ తరువాత యూపీయే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడంతో వారిరువురూ మళ్ళీ  2014 ఏప్రిల్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిలో వివేక్ పెద్దపల్లి నుంచి లోక్ సభకు, వివేక్ చెన్నూరు నుంచి శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు.

ఎన్నికలలో తెరాసను, కేసీఆర్‌ను తిట్టిపోసిన వారిరువురూ మళ్ళీ అదే తెరాసలో చేరడం విశేషం. అయితే ఈ నాలుగున్నరేళ్లలో తమకు తెరాసలో సముచిత స్థానం, గౌరవం లభించలేదనే కారణంతో జి.వినోద్ మళ్ళీ కాంగ్రెస్‌ గూటిలో చేరేందుకు ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దలతో మాట్లాడి వారిద్వారా కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ఒప్పించినట్లు తెలుస్తోంది.

ఈ శుక్రవారం పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో లేదా త్వరలో రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఆయన సమక్షంలో గానీ వినోద్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు తాజా సమాచారం. బహుశః ఆయనతోపాటు ఆయన సోదరుడు జి.వివేక్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చునని సమాచారం. పదవులు,అధికారం కోసం ఇన్నిసార్లు పార్టీలు మారిన వారిరువురూ ఒకవేళ ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మళ్ళీ తెరాసలోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు.


Related Post