గద్దర్ గమ్యమేమిటో?

October 12, 2018


img

ప్రజా గాయకుడు గద్దర్, తన కుమారుడు సూర్యకిరణ్ తో కలిసి శుక్రవారం డిల్లీ చేరుకొని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఆయన ఈసారి గజ్వేల్ నుంచి పోటీ చేయాలనుకొంటున్నట్లు చెప్పారు కనుక ఆ టికెట్ కోసమే డిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీని కలిసి ఉండవచ్చునని అందరూ భావించారు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరలేదు.

రాహుల్ గాంధీతో సమావేశం ముగిసిన తరువాత గద్దర్ మీడియాతో మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ నన్ను కాంగ్రెస్ పార్టీలో చేరమని అడిగారు. కానీ నేను కాంగ్రెస్ వంటి సెక్యులర్ పార్టీలకు ప్రజలకు మధ్య వారధిలా ఉండాలనుకొంటున్నానని చెప్పడంతో ఆయన ఇక నాపై ఒత్తిడి చేయలేదు. ప్రస్తుతం తెలంగాణలో మళ్ళీ రాచరికపాలన సాగుతోంది. దాని స్థానంలో మళ్ళీ ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించాలని, దానికి నావంటివారందరం అండగా నిలబడతామని చెప్పాను. తరువాత ఇక్కడ ఉండే సెక్యులర్ పార్టీల నేతలందరినీ కలుసుకొని దేశంలో మళ్ళీ ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పవలసిన అవసరం గురించి నొక్కి చెపుతాను. ప్రజల మనిషిని.... వారి గొంతు అయిన నేను ఏ పార్టీలో చేరదలచుకోలేదు. సెక్యులర్ పార్టీలకు-ప్రజలకు మద్య వారధిగా నిలవాలని అనుకొంటున్నాను,” అని చెప్పారు.

విప్లవబాటలో సాగిన గద్దర్ దాని వలన ఏ ప్రయోజనం లేదని గ్రహించదానికి సుమారు నాలుగు దశాబ్ధాల సమయం పట్టింది. తన ఆశయాలు నెరవేర్చుకోవాలంటే రాజకీయాలలో ప్రవేశించడం అవసరం అని గద్దర్ గ్రహించినట్లే ఉన్నారు కానీ ఏ పార్టీలో చేరనని చెప్పడం గమనిస్తే ఆయన ఇంకా అగమ్యంగానే ముందుకు సాగుతున్నతున్నారనిపిస్తుంది. రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని ఊరూరూ తిరుగుతూ దాని గురించి ఎంతకాలం ప్రచారం చేసినా ప్రజలలో వ్యవస్థలలో ఏమి మార్పు వస్తుంది?చివరకు ఆయన సాధించేది ఏముంటుంది? అని ఆలోచిస్తే ఆయన ఎంత ఆగమ్యంగా సాగుతున్నారో అర్ధం అవుతుంది. ఒకవేళ ఆయన ఇలాగే పాటలు పాడుకొంటూ మరో ఒకటి-రెండు దశాబ్ధాలు గడపాలనుకొంటే మాత్రం ఏ పార్టీలో చేరకుండా ఎన్నికలలో పోటీ చేయకుండా ఉంటేనే మంచిది.


Related Post