రాజయ్య ఓకే! బాబూ మోహన్ నాట్ ఓకే?

October 11, 2018


img

తెరాస సిట్టింగ్ ఎమ్మెల్యేలలో అవినీతి ఆరోపణలతో మంత్రివర్గంలో నుంచి తొలగించబడిన టి.రాజయ్యకు మొదటి జాబితాలోనే టికెట్ లభించింది కానీ ఎటువంటి ఆరోపణలు లేని ఆంధోల్ ఎమ్మెల్యే బాబూ మోహన్ కు మాత్రం టికెట్ లభించకపోవడం విచిత్రంగా ఉంది. బాబూ మోహన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్థానిక తెరాస నేతలతో, అధికారులతో దురుసుగా వ్యవహరించిన కారణంగానే కేసీఆర్‌ ఆయనకు టికెట్ ఇవ్వలేదనే వార్తలు వినిపించాయి.

అయితే రాజయ్యపై అంతా కంటే తీవ్రమైన ఆరోపణలు రావడమే కాకుండా, అయన ఒక పరాయి మహిళతో మొబైల్ ఫోన్లో చేసిన సరస సంభాషణలు కూడా బయటపడ్డాయి. నియోజకవర్గంలో తెరాస నేతలు, కార్యకర్తలు కడియం శ్రీహరికి ఆయనపై అనేక పిర్యాదులు చేసి వ్యతిరేకత తెలియజేశారు. అయినప్పటికీ సిఎం కెసిఆర్ రాజయ్యను మార్చేందుకు నిరాకరించారు. 

కడియం శ్రీహరి ఈరోజు రాజయ్యను మందలిస్తూ కాస్త పద్దతులు మార్చుకొని నియోజకవర్గంలో అందరినీ కలుపుకుపోవాలని హితవు పలికారు. కేసీఆర్‌ ఆదేశం ప్రకారం నియోజకవర్గంలో రాజయ్య తరపున ప్రచారం చేస్తానని, సిఎం కెసిఆర్, తన అభిమానులు రాజయ్యకే ఓటు వేసి గెలిపించాలని కడియం శ్రీహరి కోరారు. రాజయ్యపై అవినీతి ఆరోపణలున్నప్పటికీ, ఆయన పట్ల స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ ఇంత ఉదారంగా వ్యవహరిస్తున్న తెరాస అధిష్టానం మరి బాబూ మోహన్ పట్ల అంత నిర్దయగా ఎందుకు వ్యవహరించిందో?


Related Post