అధికారం కోసమే తప్పుడు హామీలు ఇచ్చాం: గడ్కారీ

October 10, 2018


img

రాజకీయ చైతన్యం అంతగా లేని రోజులలో రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల హామీలను అమలు చేయకపోయినా ఎవరూ వాటిని గట్టిగా నిలదీసేవారు కారు. కానీ గత ఒకటి-రెండు దశాబ్ధాలుగా ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా, సోషల్ మీడియాలో గట్టిగా నిలదీస్తున్నారు. కనుక రాజకీయ పార్టీలు కాస్త ఆచితూచి హామీలు ఇస్తున్నాయనే చెప్పవచ్చు. అయినా నేటికీ అధికారం చేజిక్కించుకోవడం కోసం అన్ని పార్టీలు ఆచరణ సాధ్యం కానీ హామీలను ఇస్తూనే ఉన్నాయి. 

కలర్స్ హిందీ ఛానల్ ఇటీవల నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి  నితిన్ గడ్కారీ ఒక ప్రశ్నకు సమాధానం చెపుతూ, “అధికారం చేజిక్కించుకోవాలంటే ప్రజలను ఆకట్టుకోవాలి. అందుకు ఆచరణ సాధ్యం కానీ హామీలను ఈయక తప్పదని కొందరు పెద్దలు సలహాలను పాటించి గత ఎన్నికలలో గెలిచాము. ఒకవేళ ఎన్నికలలో ఓడిపోతే ఎలాగూ వాటి గురించి మమ్మల్ని ఎవరూ ప్రశ్నించలేరనే ఉద్దేశ్యంతోనే మేము అంత ధైర్యం చేశాము. వాటిని నమ్మి ప్రజలు మమ్మల్ని గెలిపించారు. కానీ అవి ఆచరణ సాధ్యం కావు కనుక వాటి అమలు కోసం మేము ఎటువంటి ప్రయత్నాలు చేయని మాట వాస్తవం. వాటి గురించి ప్రజలు, ప్రతిపక్షాలు మమ్మల్ని నిలదీస్తుంటే ఒక నవ్వు నవ్వి ఊరుకొంటాము. అంతకంటే ఏమి చేయగలం?” అని అన్నారు. 

త్వరలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటిలో నాలుగు బిజెపి పాలిత రాష్ట్రాలే. కనుక వాటిని తిరిగి దక్కించుకోవడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలతో సహా బిజెపి నేతలు అందరూ ఆ రాష్ట్రాలలో జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తూ మళ్ళీ కొత్త హామీలు ఇస్తున్నారు. సరిగ్గా ఇటువంటి కీలక సమయంలో మోడీ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న నితిన్ గడ్కారీ ఈవిధంగా మాట్లాడి బిజెపిని ఇరకాటంలో పడేశారు. కాంగ్రెస్ పార్టీ అప్పుడే బిజెపిపై ఎదురుదాడి మొదలుపెట్టింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇవాళ్ళ కరీంనగర్ లో ఎన్నికల ప్రచారసభ నిర్వహిస్తున్నారు. మరి ఆయనేమి హామీలిస్తారో చూడాలి.


Related Post