లక్ష్మణ్ గారు మరీ అన్నీ జోకులా...

October 09, 2018


img

రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెస్, తెరాసల పరిస్థితి గురించి రాష్ట్ర బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఇవాళ్ళ చాలా సీరియస్‌గానే మాట్లాడినప్పటికీ, ఆయన మాటలు వింటే ఎవరికైనా నవ్వురాకమానదు. ఆయన అంత సీరియస్‌గా అన్ని జోకులు ఎలా వేయగలిగారని ఆశ్చర్యం కలుగుతుంది కూడా. ఇంతకీ ఆయన ఎమ్మన్నారంటే...

• రాష్ట్రంలో 119 సీట్లకు ఒంటరిగా పోటీ చేస్తున్న బిజెపిని చూసి తెరాస, కాంగ్రెస్ పార్టీలు భయపడిపోతున్నాయి. అందుకే తెరాస మజ్లీస్ పార్టీతో, కాంగ్రెస్ టిడిపితో పొత్తులు పెట్టుకొంటున్నాయి. 

• మాకు అభ్యర్ధులు లేరని దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకే అభ్యర్ధులు లేరు. అందుకే అది మహా కూటమిపేరుతో కొన్ని సీట్లు మిత్రపక్షాలకు వదులుకోవడానికి సిద్దపడుతోంది.    

• కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోనే కాదు...దేశంలో ఎక్కడా ఒంటరిగా పోటీ చేసే శక్తి లేదు. అందుకే యూపి ఎన్నికలప్పుడు అఖిలేశ్ యాదవ్ సైకిల్ వెనుక ఎక్కి తిరిగారు రాహుల్ గాంధీ. ఇప్పుడు టిడిపి సైకిల్ ఎక్కబోతున్నారు. మళ్ళీ లోక్ సభ ఎన్నికలో రాహుల్ గాంధీ ఇక్కడ కారెక్కుతారో లేక సైకిలే ఎక్కుతారో లేక యూపిలో ఏనుగే ఎక్కుతారో చూడాలి. అయితే ఎప్పుడైనా ఎక్కడైనా సరే కాంగ్రెస్ పార్టీ తోకపార్టీగానే ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను.   

• మహా కూటమి మజ్బూత్ కూటమి కాదు. మజ్బూర్ కూటమి. కాంగ్రెస్ పార్టీకి గతిలేకనే టిడిపితో ఎన్నికల పొత్తులకు సిద్దపడింది. 

• అమిత్ షా గట్టిగా రెండు రోజులు నల్గొండలో తిరిగితేనే కాంగ్రెస్, తెరాస నేతలకు భయంతో కాళ్ళు వణికిపోయాయి. అదే ఆయన గట్టిగా పూనుకొని ఎన్నికల ప్రచారం చేస్తే వాటి పరిస్థితి ఏమిటి?

• కాంగ్రెస్, దాని మహాకూటమి, తెరాసలపై మేము బ్రహ్మాస్త్రం, సమ్మోహనాస్త్రాలు సందించబోతున్నాము. ఆ అస్త్రాల పేరే నరేంద్ర మోడి! ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం మొదలుపెడితే కాంగ్రెస్, తెరాసల పని పూర్తయిపోతుంది. 

బిజెపికి భయపడి కాంగ్రెస్ పార్టీ టిడిపితో, తెరాస మజ్లీస్ పార్టీతో పొత్తులు పెట్టుకొన్నాయని లక్ష్మణ్ వంటి రాజకీయ అనుభవజ్నుడు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కానీ వాస్తవ పరిస్థితి ఏమిటో సామాన్య ప్రజలకు సైతం తెలుసు.


Related Post