రేవంత్‌రెడ్డి...నన్ను ఓడించగలవా?

October 09, 2018


img

కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి పరిచయం అక్కరలేని రాజకీయ నాయకుడు. ఇదివరకు టిడిపిలో ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఆయన లక్ష్యం మారలేదు. సిఎం కెసిఆర్ నే లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కనుక అది ఆయనకు కంచుకోట వంటిదని వేరే చెప్పనక్కరలేదు. ఈసారి ఆ కంచుకోటను బద్దలు కొట్టాలని తెరాస పట్టుదలగా ఉంది. ఆ ఒక్కటే కాదు ఈసారి కాంగ్రెస్ పార్టీకి బలమున్న నల్గొండలో అన్ని నియోజకవర్గాలను కైవసం చేసుకొని ఆ పార్టీ ముఖ్య నేతలను మళ్ళీ కోలుకోలేనివిదంగా దెబ్బ తీయాలని తెరాస ఉవ్విళ్ళూరుతోంది. కనుక అందుకు అనుగుణంగానే వ్యూహ రచన చేసుకొంటోంది. బహుశః అందుకే సిఎం కెసిఆర్ ఇటీవల నల్గొండలో ఎన్నికల ప్రచారసభ నిర్వహించి జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో గులాబీ జెండా ఎగురవేయబోతున్నామని ప్రకటించి, కోమటిరెడ్డి సోదరులకు సవాలు విసిరారనుకోవచ్చు. 

అదేవిధంగా కొడంగల్ నుంచి బరిలో దిగుతున్న తెరాస అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి కూడా రేవంత్‌రెడ్డికి సవాళ్ళు విసురుతున్నారు. కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేయవలసిన రేవంత్‌రెడ్డి, అక్కడ ప్రభుత్వ పధకాలు ఏవీ అమలుకాకుండా అడ్డుపడుతున్నప్పటికీ తమ ప్రభుత్వం చొరవ తీసుకొని చాలా అభివృద్ధి చేసిందని చెప్పారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కొడంగల్ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, కనుక ఈసారి తనను గెలిపిస్తే కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని పట్నం నరేందర్ రెడ్డి చెపుతున్నారు. రేవంత్‌రెడ్డి సిఎం కెసిఆర్ ను గద్దె దించుతానని ప్రగల్భాలు పలుకుతున్నారని, కానీ ముందు తనపై గెలిచి చూపాలని పట్నం నరేందర్ రెడ్డి సవాలు విసిరారు. 

ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళను పక్కన పెడితే రేవంత్‌రెడ్డి సిఎం కెసిఆర్ తో నిత్యం యుద్ధం చేస్తున్నందున, కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధికి తెరాస సర్కారు ఆయనకు సహకరిస్తుందని ఆశించలేము. అలాగని రేవంత్‌రెడ్డి తన స్వంత నిధులతో మొత్తం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం అసాధ్యమే. కనుక ఇది తెరాస అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డికి కలిసి వచ్చే అంశంగానే భావించవచ్చు. అయితే కొడంగల్ నియోజకవర్గంపై రేవంత్‌రెడ్డికి మంచి పట్టు ఉంది కనుక ఆయనను ఓడించడం కూడా కష్టమే. ఎన్నికలు దగ్గర పడే సమయానికి కొడంగల్ ప్రజలు వారిరువురిలో ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి. 


Related Post