తెరాస వ్యూహం ఫలిస్తుందా?

October 09, 2018


img

కాంగ్రెస్ పార్టీ టిడిపితో పొత్తులు పెట్టుకోవడానికి సిద్దమైనప్పటి నుంచి తెరాస నేతలు టిడిపితో పొత్తులు పెట్టుకోవడాన్ని తప్పుపడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి హరీష్ రావు ఈరోజు ఆ రెండు పార్టీలపై విమర్శలు గుప్పించారు. టిడిపితో ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకోంటోందో చెప్పాలని డిమాండ్ చేస్తూ మంత్రి హరీష్ రావు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి 12 ప్రశ్నలతో కూడిన ఒక బహిరంగలేఖను విడుదల చేశారు.

హైకోర్టు విభజన, ఆంధ్రా, తెలంగాణ ఆస్తులు, ఉద్యోగాల పంపకాలు, నీళ్ళు, విద్యుత్ పంపకాలు, వినియోగం, ప్రాజెక్టులపై అభ్యంతరాలు, పిటిషన్లు వగైరా సమస్యలు పరిష్కారం కాకుండా చంద్రబాబు నాయుడు అడ్డుపడుతుంటే, కాంగ్రెస్ పార్టీ ఏ మొహం పెట్టుకొని టిడిపితో పొత్తులు పెట్టుకొంటోందని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న చంద్రబాబు నాయుడితో కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకొంది కనుక తెలంగాణ పట్ల ఆయన వైఖరిలో మార్పు వస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇవ్వగలరా? అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. 

నిజానికి ఈసారి ఎన్నికలలో 110 సీట్లు గెలుచుకొంటామని ధీమా వ్యక్తం చేస్తున్న తెరాస, వాటి పొత్తుల గురించి ఇంతగా స్పందించనవసరం లేదు. కానీ చిన్న పాము నైనా పెద్ద కర్రతో చంపాలన్నట్లు, తమకు గట్టి పోటీ నిస్తున్న ఆ రెండు పార్టీలను చావు దెబ్బ తీయడానికే తెరాస నేతలు ఈ వాదన మొదలుపెట్టి ఉండవచ్చు. తెరాస నేతలు తమ వాదనలతో తెలంగాణ సాధన కోసం పోరాడిన ప్రొఫెసర్ కోదండరామ్ పట్ల ప్రజలలో విముఖత కలుగజేయగలిగినప్పుడు, టిడిపిపట్ల, దానితో పొత్తులు పెట్టుకొన్నందుకు కాంగ్రెస్ పార్టీ పట్ల విముఖత కలిగేలా చేయలేరనుకోలేము. అంతేకాదు... తెరాస నేతల ఈ వాదనలతో కాంగ్రెస్ పార్టీలో టిడిపి అనుకూల వ్యతిరేక వర్గాల మద్య భేధాభిప్రాయాలకు దారి తీయవచ్చు. కనుక టిడిపి భుజంపై తుపాకీ పెట్టి కాంగ్రెస్ పార్టీకి గురి పెడుతోందని భావించవచ్చు. మరి ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.


Related Post