గజ్వేల్ నుంచి పోటీ చేస్తా: గద్దర్

October 09, 2018


img

గత నాలుగు దశాబ్ధాలుగా విప్లవశంఖం పూరించిన ప్రజాగాయకుడు గద్దర్ రెండేళ్ల క్రితం తన విప్లవపంధాను వీడి ప్రజాస్వామ్యం బాట పట్టారు. అప్పటి నుంచి ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల గురించి ప్రచారం చేస్తున్నారు కూడా. అదే విచిత్రమనుకొంటే సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్ళి తన పేరును ఓటరుగా నమోదు చేయించుకొన్నారు.

ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు సై అంటున్నారు. ప్రజలు కోరుకొంటే తాను గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకొంటున్నానని చెప్పారు. తాను స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలని భావిస్తుంటే, ప్రతిపక్షపార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయని కనుక త్వరలో దీనిపై తుది నిర్ణయం తీసుకొంటానని చెప్పారు.

ఈసారి ఎన్నికలలో మహాకూటమి-తెరాస మద్య తీవ్రస్థాయిలో పోటీ జరుగబోతోంది కనుక చాలా మంది ప్రజలు ఆ రెంటిలో ఏదో ఒక పార్టీ వైపు మొగ్గే అవకాశం ఉంది. అదీగాక ఈసారి ఎన్నికలలో రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో 110 స్థానాలలో గులాబీ జెండా ఎగురవేస్తామని, కాంగ్రెస్ పార్టీలో ప్రముఖులకు సైతం డిపాజిట్లు దక్కవని సిఎం కెసిఆర్ డంకా బజాయించి చెపుతున్నప్పుడు, తెరాస ధాటిని తట్టుకొని గద్దర్ నిలబడగలరా? అంటే అనుమానమే.


Related Post