కోమటిరెడ్డి ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారా? లేక...

October 08, 2018


img

సీనియర్ కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒకప్పుడు టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించి ఆయన ఆ పదవిలో నుంచి తప్పుకోవాలని, ఆ పదవి తనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ ఆ తరువాత కాంగ్రెస్‌ అధిష్టానం చేసిన హెచ్చరికలతో ఆయన మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విమర్శలు చేయడం మానుకొన్నారు. అలాగే టి-పిసిసి అధ్యక్ష పదవి కావాలని అడగటం కూడా మానుకొన్నారు. అయితే రాష్ట్రంలో ఎన్నికల గంట మ్రోగిన తరువాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో కొత్త వాదన వినిపిస్తున్నారు.

ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే తెలంగాణాకు ముఖ్యమంత్రి అవుతారని చెపుతున్నారు. రెండు రోజుల క్రితం మళ్ళీ ఇదే మాట చెప్పారు. నల్గొండలో 12 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని, వారిలో నుంచే ఒకరు ముఖ్యమంత్రి అవుతారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అంటే నల్గొండకు చెందిన ఆయన ముఖ్యమంత్రి కావాలనుకొంటున్నారా? లేక జిల్లాకు చెందిన జానారెడ్డికి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఆయన మద్దతు ప్రకటిస్తున్నారా? అనేది స్పష్టం కావలసి ఉంది.

అయితే ఈ వాదనతో ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తాను అంగీకరించబోనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేస్తున్నట్లే భావించవచ్చు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు కానీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేవనెత్తుతున్న పార్టీలో వివిద జిల్లాలకు చెందిన అరడజనుకు పైగా ఉన్న ముఖ్యమంత్రి అభ్యర్ధులు ఈ అంశంపై నోరు విప్పి మాట్లాడటం మొదలుపెడితే ఏమవుతుందో తేలికగానే ఊహించుకోవచ్చు.


Related Post