ఎన్నికల ప్రచార సరళిని మార్చేసిన సిఎం కెసిఆర్‌

October 06, 2018


img

సిఎం కెసిఆర్‌ ప్రగతి నివేధన సభ వరకు చాలా హుందాగానే మాట్లాడారు కానీ ఆ తరువాత వరుసగా నిర్వహించిన మూడు బహిరంగసభలలో ప్రతిపక్ష నాయకులను ఉద్దేశ్యించి తీవ్ర పదజాలంతో విరుచుకుపడి రాష్ట్రంలో ఎన్నికల వేడిని అమాంతం పెంచేశారు. ఆయన స్వయంగా చాలా అనుచితమైన బాషను, పదాలను ప్రయోగిస్తున్నందున ప్రతిపక్ష నేతలు కూడా ఆయనను, టిఆర్ఎస్‌ నేతలను ఉద్దేశ్యించి అంతకంటే హీనంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

ప్రజాసమస్యలు, స్థానిక సమస్యలు, రాష్ట్రాభివృద్ధి గురించి చర్చించడం తగ్గిపోయి దాని స్థానంలో అధికార, ప్రతిపక్షాల నేతలు ఒకరినొకరు వ్యక్తిగత స్థాయిలో దూషించుకోవడం, ఒకరి అవినీతిని మరొకరి తవ్వి తీసి బయటపెట్టుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వారి తిట్ల పురాణం చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారు తప్ప వారు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఎందుకంటే ఏమాత్రం వెనక్కు తగ్గినా ఎదుటవారు ఇంకా రెచ్చిపోతే ఎన్నికల రేసులో వెనకబడిపోతామనే భయమే కారణం. కనుక ఎవరి వచ్చిన తిట్ల పురాణం వారు వినిపిస్తున్నారు. 

ఎన్నికల సమయంలో పరస్పర విమర్శలు, ఆరోపణలు సహజమే కానీ ఈసారి ఎన్నికలలో అవి మరింత శృతి మించుతున్నాయి. ఇప్పుడే ఇటువంటి పరిస్థితి కనిపిస్తుంటే మున్ముందు ఎన్నికల దగ్గర పడిన తరువాత పరిస్థితులు ఇంకెంత దారుణంగా ఉంటాయో ఊహించలేము. దీనికంతటికీ కారణం సిఎం కెసిఆర్‌ తిట్ల పురాణంతో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తుండటమేనని చెప్పక తప్పదు. కనుక ఇప్పటికైనా ఆయన కాస్త వెనక్కు తగ్గితే ప్రతిపక్షాలు కూడా తగ్గే అవకాశం ఉంది. అప్పుడు రాష్ట్రానికి సంబందించిన సమస్యలపై అన్ని పార్టీలు తమ తమ వాధనలు వినిపించి ప్రజల తీర్పు కోరవచ్చు. 


Related Post