ముందు నన్ను అరెస్ట్ చేసి చూపొచ్చు కదా? రేవంత్ రెడ్డి

October 06, 2018


img

సిఎం కెసిఆర్‌ ప్రసంగాలపై కాంగ్రెస్‌ నేత రేవంత్ రెడ్డి స్పందించారు. ఈరోజు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఓటుకు నోటు కేసు పేరు చెప్పి సిఎం కెసిఆర్‌ మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నాడు. ఏపీలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు..నేను మీ ఎదురుగానే ఉన్నాను కదా...ముందు నన్నే అరెస్ట్ చేసి చూపోచ్చు కదా... నువ్వు నీ వెనుక ఉన్న ప్రధాని మోడీ కలిసి? ముందు నన్ను దాటి వెళ్ళి చూపించు...అప్పుడు నీకు ఏ పాటి శక్తి సామర్ధ్యాలున్నాయో అందరూ చూస్తారు,” అని సవాల్ విసిరారు. 

ఇక చంద్రబాబు నాయుడును కెసిఆర్‌ తిట్టడంపై స్పందిస్తూ  “ఈ ఎన్నికలతో చంద్రబాబు నాయుడుకు ఎటువంటి సంబందామూ లేదు. కానీ తెలంగాణా గడ్డపై పుట్టిన టిడిపికి ఖచ్చితంగా సంబందం ఉంది. అందుకే పోటీ చేస్తోంది. ఒక రాజకీయ పార్టీగా అది కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం తప్పు కాదు. ఈసారి ఎన్నికలలో పోటీ ప్రధానంగా కాంగ్రెస్‌-టిఆర్ఎస్‌ల మద్యే ఉంటుందని గతంలో కేటీఆర్‌ చాలాసార్లు చెప్పారు. కానీ టిడిపి-టిఆర్ఎస్‌ మద్య పోటీ జరుగబోతోందన్నట్లు కెసిఆర్‌ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే, ఈ నాలుగేళ్లలో చేసిందేమీ లేదు కనుక వాటి గురించి తనను నిలదీస్తున్న కాంగ్రెస్‌ నేతలను ఎదుర్కొలేక ప్రజల దృష్టిని తన వైఫల్యాలు, రాష్ట్ర సమస్యలపై నుంచి మళ్లించడానికే చంద్రబాబు నాయుడును తిట్టిపోస్తున్నారు. తద్వారా తెలంగాణా ప్రజలలో సెంటిమెంటు రగిలించి గట్టెక్కాలనుకొంటున్నారు. కానీ కెసిఆర్‌ ఆడుతున్న ఈ నాటకాలన్నిటినీ ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. ఆయనకు తగినవిధంగా బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు,” అని రేవంత్ రెడ్డి అన్నారు. 

ఓటుకు నోటు కేసులొ తనను అరెస్ట్ చేయమని రేవంత్ రెడ్డి సిఎం కెసిఆర్‌కు సవాలు విసరడం గొప్ప విషయమే. ఆయన ఏ ధైర్యంతో ఆ సవాలు విసురుతున్నారో తెలియదు కానీ బంతిని సిఎం కెసిఆర్‌ కోర్టులో పడేశారని చెప్పవచ్చు. మరి రేవంత్ రెడ్డి సవాలుపై కెసిఆర్‌ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. 


Related Post