చంద్రబాబు మెడకు ధర్మాబాద్ కేసు చుట్టుకొందా?

October 06, 2018


img

ధర్మాబాద్ కోర్టు ఆదేశాలపై తన మంత్రుల, న్యాయనిపుణుల సలహా తీసుకొన్న ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు అక్టోబర్ 15న జరిగే విచారణకు హాజరు కాకూడదని నిర్ణయించుకొన్నారు. మళ్ళీ తన తరపు న్యాయవాదిని పంపించి అరెస్ట్ వారెంటును రీకాల్ చేయాలని కోరాలని నిశ్చయించుకొన్నారు. ధర్మాబాద్ వెళ్ళినట్లయితే అరెస్ట్ చేయడం ఖాయమని, కనుక కేంద్రప్రభుత్వం పన్నిన ఈ ఉచ్చులో చిక్కుకోవద్దని నటుడు శివాజీ ముందే హెచ్చరించారు. బహుశః అందుకే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. 

చంద్రబాబు నాయుడు తదితర టిడిపి నేతలు మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ 2010లో నిషేధాజ్నాలు ఉల్లంఘించి ప్రాజెక్టు నిర్మాణ స్థలానికి వెళ్లినందుకు నమోదైన కేసు విచారణ ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకొన్నట్లుంది. ఆ కేసులో మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు ఆయనతో సహా 16మందిపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈకేసుపై సెప్టెంబర్ 21న జరిగిన విచారణకు చంద్రబాబు నాయుడు హాజరుకాలేదు. తన న్యాయవాది ద్వారా తనపై జారీ చేసిన నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంటును రీకాల్ చేయాలని కోరారు. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారైనా, కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా గౌరవించవలసిందేనని అక్టోబర్ 15న జరిగే విచారణకు చంద్రబాబు నాయుడుతో సహా అందరూ హాజరు కావలసిందేనని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. అప్పుడే ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి ఈసారి చంద్రబాబు నాయుడు అభ్యర్ధనను మన్నిస్తారనుకోలేము. కనుక బాబుకు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చునేమో? బాబు బాషలో చెప్పాలంటే ఒకపక్క కెసిఆర్‌ తిట్లు, మరోపక్క జగన్, ఇంకో పక్క పవన్, బిజెపి నేతల తిట్లు, ఇంకోపక్క గుబులు పుట్టిస్తున్న ఐటిే దాడులు, ఎప్పుడో 8 ఏళ్ళ క్రితం నాటి ఈ ధర్మాబాద్ కేసు వగైరాలను చూస్తుంటే చంద్రబాబు గ్రహస్థితి ఏమీ బాగునట్లు లేదు. 


Related Post