కెసిఆర్‌ బాబునే ఎందుకు టార్గెట్ చేస్తున్నట్లు?

October 06, 2018


img

 సిఎం కెసిఆర్‌ నిజామాబాద్‌, నల్గొండ, వనపర్తిలో వరుసగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలలో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుండటం చూసి రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ ఎన్నికలతో అసలు సంబందంలేని చంద్రబాబునే లక్ష్యంగా చేసుకొని ఆయన ఎందుకు తిట్లవర్షం కురిపిస్తున్నారు? అని ఆలోచిస్తే చాలా బలమైన కారణమే కనిపిస్తోంది. 

నిజానికి టిఆర్ఎస్‌కు సవాలు విసురుతున్నది కాంగ్రెస్ పార్టీయే కానీ టిడిపి, చంద్రబాబు నాయుడు కానే కాదనే సంగతి అందరికీ తెలుసు. మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీదే ప్రధానపాత్ర.  టిడిపి మహా అయితే 10-15 స్థానాలు లభించవచ్చు. కానీ సిఎం కెసిఆర్‌ టిడిపియే ప్రధానపార్టీ అన్నట్లు బాబుపై యుద్దం ప్రకటించారు. తద్వారా ప్రజల దృష్టిని కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిపైకి మళ్లించే ప్రయత్నం చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ఆయన ఈ ప్రయత్నంలో సఫలం అయితే ఏమవుతుందో అందరికీ తెలుసు. తెలంగాణాకు టిడిపి, దాని అధినేత చంద్రబాబు నాయుడు తీరని ద్రోహం చేసారనే భావన ప్రజలలో వ్యాపింపజేయగలిగితే, వారు టిడిపిపై వ్యతిరేకతతో మహాకూటమిని...దాని ద్వారా టిఆర్ఎస్‌కు గట్టి సవాలు విసురుతున్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని సిఎం కెసిఆర్‌ ఆలోచన కావచ్చు.

టిఆర్ఎస్‌తో పాటు బిజెపి కూడా కాంగ్రెస్‌ టిడిపిల పొత్తులపై తీవ్ర విమర్శలు చేస్తోంది. కనుక సిఎం కెసిఆర్‌ వాదనకు బలం చేకూరుతోంది. కాంగ్రెస్‌ పార్టీ, టిడిపిపొత్తులు పెట్టుకొని టిఆర్ఎస్‌ను ఎదుర్కోవాలననుకొంటే, అదే టిడిపిని ప్రజలకు బూచిగా చూపించి కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయాలని సిఎం కెసిఆర్‌ ప్రయత్నించడం ఆయన రాజకీయ చతురతకు అద్దం పడుతోంది.  

కెసిఆర్‌ తిట్లకు చంద్రబాబు నాయుడు ధీటుగా జవాబు చెప్పలేని నిస్సహాయత కూడా సిఎం కెసిఆర్‌కు బాగా కలిసివస్తోందని చెప్పవచ్చు. సిఎం కెసిఆర్‌ అంతగా తిట్టిపోస్తున్నా చంద్రబాబు మౌనం వహిస్తుండటం ఆయన చేస్తున్న ఆరోపణలను అంగీకరిస్తున్నట్లుంది. కనుక చంద్రబాబు నాయుడి ఈ బలహీనతను ఆధారంగా చేసుకొని సిఎం కెసిఆర్‌ ఈ సరికొత్త గేమ్ ప్లాన్ అమలుచేస్తున్నారని అర్ధం అవుతోంది. చంద్రబాబుపై కెసిఆర్‌ చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్‌ నేతలు ఎలాగూ జవాబు చెప్పరు...చెప్పలేరు కూడా. ఇక టిటిడిపి నేతలు బాబును వెనకేసుకొని వస్తూ మాట్లాడితే, ‘తెలంగాణా రాష్ట్రాన్ని అమరావతికి తాకట్టు పెడతారనే’ సిఎం కెసిఆర్‌ వాదనకు బలం చేకూర్చినట్లవుతుంది. కనుక వారు కూడా ఈవిషయంలో సిఎం కెసిఆర్‌పై నేరుగా ఎదురుదాడి చేయలేరు. అలాగని మౌనంగా ఉండలేరు. సిఎం కెసిఆర్‌ అమలుచేస్తున్న ఈ పద్మవ్యూహంలో నుంచి కాంగ్రెస్‌, టిడిపిలు ఏవిధంగా బయటపడతాయో చూడాలి.


Related Post