ప్రధాని పదవిపై రాహుల్‌ ఆశలు వదిలేసుకొన్నారా?

October 06, 2018


img

దేశంలో కాంగ్రెస్‌ నాయకులు అందరూ రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తమ లక్ష్యమని పదేపదే చెప్పుకొంటుంటే, రాహుల్‌గాంధీ మాత్రం ప్రధానమంత్రి పదవిపై ఆశలు వదిలేసుకొన్నట్లు మాట్లాడటం విశేషం. డిల్లీలో జరిగిన హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్‌ సమ్మిట్‌–2018లో  మాట్లాడుతూ, “వచ్చే లోక్‌సభ ఎన్నికలలో నరేంద్ర మోడీని గద్దె దించడమే మా ప్రధానలక్ష్యం. అందుకోసం దేశంలో బిజెపిని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలన్నిటినీ కలుపుకుపోతాము. ఎన్నికలలో మా కూటమి విజయం సాధించిన తరువాత అందరూ కూర్చొని ప్రధానమంత్రి పదవి గురించి చర్చించుకొంటాము. అందరూ కోరుకొంటే నేను ప్రధానమంత్రి పదవి చేపడతాను,” అని రాహుల్‌గాంధీ అన్నారు. 

బిజెపిని, మోడీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షాలు మద్దతు తప్పనిసరని రాహుల్‌గాంధీ మాటలతో స్పష్టం అయ్యింది. కనుక ప్రధానమంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీకి....రాహుల్‌గాంధీకి ఎంత హక్కు, మోజు ఉంటాయో  ప్రతిపక్షాలకు కూడా అంతే ఉంటుంది. కాంగ్రెస్‌ చరిత్రలో ఇంతవరకు ప్రధానమంత్రి పదవి విషయంలో ఈవిధంగా వెనక్కు తగ్గిన దాఖలాలు లేవు. కనుక ప్రతిపక్షాలలో ప్రధాని పదవి కోసం చిరకాలంగా కలలు కంటున్న డజనుకు పైగా ఉన్న నాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని తమ కల సాకారం చేసుకొనేందుకు గట్టిగా ప్రయత్నించవచ్చు. ఒకవేళ వచ్చే లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ మిత్రపక్షాలు గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చినట్లయితే, రాహుల్‌గాంధీ ఏ కేంద్రమంత్రి పదవితోనో సరిపెట్టుకోవడానికి మానసికంగా సిద్దపడుతున్నట్లున్నారు. అంటే యుద్దరంగంలో దిగక ముందే తన రధాన్ని వేరే వాళ్ళకు అప్పగించడానికి సిద్దపడుతున్నట్లే ఉంది. ప్రధానమంత్రి కుర్చీలో కాలుమీద కాలువేసుకొని కూర్చొని దేశాన్ని పాలిస్తాడనుకొన్న యువరాజు మంత్రిగా మిగిలిపోతారా? ఏమో! 


Related Post