ఎన్నికల కురుక్షేత్రానికి బయలుదేరుతూ దేవతార్చన చేయరా!

October 06, 2018


img

ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం నెలకొని ఉన్నందున ఈ ఏడాది తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించడం లేదని ఆ సంస్థ అధ్యక్షురాలు టిఆర్ఎస్‌ ఎంపీ కవిత శుక్రవారం ప్రకటించారు. తమ సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకుండా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని కానీ ప్రతిపక్షాలు తమపై బురద జల్లుతూనే ఉన్నాయని ఆమె అన్నారు.   బతుకమ్మ ఉత్సవాలను కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తనకు బాధ కలిగిస్తోందని ఆమె అన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకొన్నామని కవిత చెప్పారు. అయితే విదేశాలలో బతుకమ్మ ఉత్సవాలను యధాతధంగా నిర్వహించుకోవచ్చునని కవిత తెలిపారు. 

తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్న సమయంలో తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించి బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ద్వారా తెలంగాణా సంస్కృతీ సాంప్రదాయాల గొప్పదనం యావత్ దేశ ప్రజలు, యావత్ ప్రపంచం గుర్తించేలా చేశారు కవిత. తద్వారా అంతవరకు సమైక్య రాష్ట్రంలో మట్టిలో మాణిక్యంగా ఉండిపోయిన తెలంగాణా ఉనికిని లోకానికి బలంగా చాటి చెప్పగలిగారు. అదే సమయంలో తెలంగాణా కోసం ఉదృతంగా సాగుతున్న ఉద్యమాలలోకి మహిళలను కూడా ఆకర్షించగలిగారు. కనుక ఉద్యమ విజయానికి, తెలంగాణా ఏర్పాటుకు బతుకమ్మ ఉత్సవాలు ఎంతగానో తోడ్పడ్డాయని చెప్పక తప్పదు. 

తెలంగాణా ఏర్పడిన తరువాత ప్రభుత్వం కూడా సహకరించడంతో రెట్టించిన ఉత్సాహం, పట్టుదలతో గత నాలుగేళ్ళలో రాష్ట్రంలో దేశవిదేశాలలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటూ యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించగలిగారు. కానీ ఈసారి ఎన్నికల కారణంగా నిర్వహించలేకపోతున్నామని చెపుతున్నారు. అది సరికాదనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల కురుక్షేత్రానికి బయలుదేరుతున్నప్పుడు దేవాతార్చన చేయడం మంచిది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా ఈసారి ప్రభుత్వం అధికారికంగా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించలేకపోయినా తెలంగాణ జాగృతి సంస్థ రాష్ట్ర ప్రభుత్వంలో భాగం కాదు కనుక బతుకమ్మ ఉత్సవాలను యధాప్రకారం నిర్వహించడం మంచిది. ఒక గొప్ప సంప్రదాయాన్ని ప్రారంభించి ఏవో కారణాల చేత మద్యలో నిలిపివేయడం సరికాదు. బతుకమ్మ ఉత్సవాలను యధాతధంగా నిర్వహించడమే తెలంగాణా రాష్ట్రానికి, టిఆర్ఎస్‌కు శుభప్రదం. 


Related Post