కెసిఆర్‌కు కోమటిరెడ్డి సవాల్

October 05, 2018


img

నల్గొండలో నిన్న జరిగిన బహిరంగసభలో సిఎం కెసిఆర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 12 నియోజకవర్గాలలో, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 110 నియోజకవర్గాలలో గులాబీ జెండా ఎగురబోతోందని తాజా సర్వేలో తేలిందని చెప్పారు. సిఎం కెసిఆర్‌ ప్రకటనపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ, “నా జిల్లాలో 12 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ కనీసం 10 గెలుచుకొని తీరుతుంది. ఒకవేళ 10 స్థానాలు గెలవలేకపోతే నేను ఎమ్మెల్యేగా గెలిచినా నా పదవికి రాజీనామా చేస్తాను,” అని టిఆర్ఎస్‌కు సవాలు విసిరారు. 

“ఒకవేళ నల్గొండలో టిఆర్ఎస్‌ అన్ని స్థానాలు గెలుచుకొన్నట్లయితే ఇక జిల్లాలో నిత్యం హత్యలు, దోపిడీలు జరుగుతుంటాయని ఎందుకంటే, రౌడీలకు, దోపిడీదారులకు సిఎం కెసిఆర్‌ టికెట్లు ఇచ్చారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. మంత్రి జగదీష్ రెడ్డి ఆయన అనుచరులకు కమీషన్ల కోసమే దామరచర్ల ధర్మల్ ప్లాంట్ నిర్మిస్తున్నారని, ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే రూ.30,000 కోట్లు అవినీతి జరిగిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దామరచర్ల ధర్మల్ ప్లాంట్ నిర్మాణాన్ని నిలిపివేయిస్తానని, కాళేశ్వరంతో సహా టిఆర్ఎస్‌ సర్కారు చేపట్టిన అన్ని సాగునీటి ప్రాజెక్టులపై విచారణ జరిపిస్తామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.

నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి సోదరులకు మంచిపట్టు ఉందనే సంగతి అందరికీ తెలుసు. కనుక జిల్లాలో టిఆర్ఎస్‌ 12సీట్లు గెలుచుకోవడం అంత తేలిక కాదు. అలాగే టిఆర్ఎస్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా 10 సీట్లు గెలుచుకోవడం అంత సులువు కాదు. కనుక కోమటిరెడ్డి తన మాటకు కట్టుబడి ఉండదలిస్తే రాజీనామా చేయకతప్పకపోవచ్చు. ఈసారి ఎన్నికలలో టిఆర్ఎస్‌ 100 సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తుందని సిఎం కెసిఆర్‌ ఇదివరకు ప్రకటించినప్పుడు, ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోతే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శపధం చేశారు. కనుక ఈ రెంటిలో ఏదో ఒక శపధానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదేమో?


Related Post