తెలంగాణా జనసమితికి అంత బలం ఉందా?

October 05, 2018


img

మహాకూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్‌, టిడిపి, టిజెఎస్, సిపిఐ పార్టీల నేతలు శుక్రవారం మళ్ళీ సమావేశం కానున్నారు. మహాకూటమి కామన్ అజెండా ఖరారు అయ్యింది కనుక ఇవాళ్ళ కీలకమైన సీట్ల సర్దుబాట్లపై చర్చలు మొదలుపెట్టబోతున్నారు. మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న టిడిపికి రాష్ట్రంలో కొంత బలముంది... నేటికీ ఆ పార్టీలో కొందరు బలమైన నాయకులు ఉన్నారు కనుక ఆ పార్టీ నేతలు తమకు కనీసం 25 సీట్లు కేటాయించాలని కోరడంలో అర్ధం ఉంది. కానీ ఆరు నెలల క్రితం ఏర్పడిన తెలంగాణా జనసమితి (టిజెఎస్)లో దాని అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తప్ప ప్రజలందరూ గుర్తించగల నేతలు కనబడరు. ఆ పార్టీ కూడా తమకు కనీసం 15-17 సీట్లు ఇవ్వాలని పట్టుపడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. 

ఈసారి ఎన్నికలలో 110 సీట్లు గెలుచుకొని క్లీన్ స్వీప్ చేస్తామని సిఎం కెసిఆర్‌ నిన్ననే ప్రకటించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డికె అరుణ, షబ్బీర్ ఆలీ వంటి కొమ్ములు తిరిగిన సీనియర్ నేతలు అందరూ తుడిచిపెట్టుకొనిపోతారని సిఎం కెసిఆర్‌ నమ్మకంగా చెపుతున్నారు. అటువంటి సీనియర్ నేతలనే తుడిచిపెట్టేస్తానని సిఎం కెసిఆర్‌ చెపుతుంటే, అసలు ప్రజలలో గుర్తింపేలేని టిజెఎస్ నేతలను నిలబెట్టాలనుకోవడం వారి కోసం15-17 సీట్లు ఇవ్వాలని పట్టుబట్టడం నిజమైతే మహాకూటమి ఏర్పాటుకి అదే పెద్ద అవరోధంగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఒకవేళ టిజెఎస్ పార్టీకి 10 సీట్లు కేటాయించవలసి వచ్చినా అది కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ఆత్మహత్యతో సమానమనని చెప్పవచ్చు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్య వంటివి కనుక అధికారంలోకి రావడానికి ప్రతీ ఒక్క సీటు కూడా ముఖ్యమే. కనుక అది కనీసం 90 స్థానాలలో పోటీ చేయాలనే దృడసంకల్పంతో ఉంది. ఈ పరిస్థితులలో ఈరోజు జరుగుతున్నా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలైన టిజెఎస్, టిడిపి, సిపిఐ పార్టీలకు ఏవిధంగా నచ్చజెప్పుకొంటుందో చూడాలి.


Related Post