తిట్లపురాణంతో టిఆర్ఎస్‌కు లాభామా నష్టమా?

October 05, 2018


img

ఆత్మవిశ్వాసం శృతిమించితే అహంభావంగా మారుతుంది. అప్పుడు నాకన్నా గొప్పవారెవరూ లేరు. నేను ఏమి చెపితే అదే శాసనం...నేను ఏమి చేస్తే అదే సరైనది’ ఆనే వాదన వినిపిస్తుంది. ప్రస్తుతం సిఎం కెసిఆర్‌ ప్రసంగాలలో ఆ ధోరణి స్పష్టంగా కానవస్తోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షనేతలపై, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిపై చేస్తున్న అభ్యంతరకర వ్యాఖ్యలతో ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. సమర్ధమైన నాయకుడిగా, రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రిగా ప్రజలలో మంచి పేరు తెచ్చుకొన్న ఆయన ఇటువంటి అనుచితమైన మాటల కారణంగానే ప్రజల దృష్టిలో పలుచన అవుతున్నానని గ్రహించినట్లులేదు. 

ఇప్పటికే రాజకీయాలలో బాష, విలువలు చాలా దిగజారిపోయాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కెసిఆర్‌ తాను చెప్పదలచుకొన్న విషయాలను హుందాగా చెప్పినా ప్రజలను ఆకట్టుకోవచ్చు. కానీ అందుకు విరుద్దంగా మాట్లాడుతున్నందున ప్రతిపక్ష నేతలు కూడా మరో మెట్టు క్రిందకు దిగి ముఖ్యమంత్రిని ఉద్దేశ్యించి ‘బట్టే బాజ్’ వంటి అనుచిత పదాలు ఉపయోగించుతున్నారు. రాజకీయలంటే అద్ధాల మేడ వంటివి. దానిలో కూర్చొని ఇతరులపై రాళ్ళు విసిరితే నష్టపోయేది అద్ధాల మేడలో కూర్చోన్నవారే. 

ఇక టిఆర్ఎస్‌ ఎన్నికల వ్యూహంలో భాగంగా మహాకూటమిపై, చంద్రబాబునాయుడుపై సిఎం కెసిఆర్‌ నిన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తద్వారా మహాకూటమి పట్ల ప్రజలలో వ్యతిరేకత కలిగించి ఎన్నికలలో దానిని దెబ్బ తీయడం ఆయన ఉద్దేశ్యం కావచ్చు. అయితే ఎంత కాదన్నా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన గురించి సిఎం కెసిఆర్‌ అంత అనుచితంగా మాట్లాడుతుంటే తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాద్‌ జంటనగరాలలో స్థిరపడిన ఆంద్రాప్రజలు ఏమనుకొంటారో తేలికగానే ఊహించవచ్చు. గ్రేటర్ ఎన్నికలలో టిఆర్ఎస్‌ను గెలిపించిన వారే ఈ మాటల కారణంగా టిఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓటేస్తే ఏమవుతుంది? సిఎం కెసిఆర్‌ ఒకటనుకొంటే మరొకటి జరిగే అవకాశం ఉందన్న మాట. 

అయినా రాజకీయాలలో ఉన్నవారు ఎప్పుడూ మితిమీరి అహంభావం ప్రదర్శించకూడదు. ప్రదర్శిస్తే ఏమవుతుందో చరిత్ర చెపుతోంది. అధికారంలో ఉన్నంతకాలం అంతా మన చేతిలోనే ఉన్నట్లనిపిస్తుంది. అప్పుడు మనం ఏమి చెపితే ప్రజలు అదే నమ్ముతారనే భ్రమ, అహంభావంతో ముందుకు సాగుతుంటారు. కానీ ఎంత గొప్ప నాయకుడైనా అటువంటి భ్రమలో ముందుకు సాగితే బోర్లా పడకతప్పదు. ఇది పదేపదే రుజువయిన సత్యం.

కనుక సిఎం కెసిఆర్‌, టిఆర్ఎస్‌ నేతలు కూడా వీలైనంత హుందాగా మాట్లాడుతూ గత నాలుగేళ్లలో తాము ఏమి చేశామో చెప్పుకొని, మళ్ళీ తమకు ఓటేసి గెలిపిస్తే ప్రజలకు రాష్ట్రానికి ఏమి చేయదలచుకొన్నారో వివరిస్తే మంచిది. రాజకీయాలలో ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలపై విమర్శలు చేయక తప్పదు. కానీ అవీ హుందాగా ఉంటే ప్రజలను కూడా అవి ఆలోచింపజేస్తాయి.


Related Post