అప్పుడు టిడిపి...ఇప్పుడు టిఎఎన్సీ!

October 04, 2018


img

2014 ఎన్నికలలో తెలంగాణాలో సీనియర్ టిడిపి నేలందరినీ పక్కనపెట్టి, ఎన్నికలకు ముందు బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు ఆర్.కృష్ణయ్యను పార్టీలో చేర్చుకొని టిడిపి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు. కారణం అందరికీ తెలుసు. ఆ తరువాత ఏమి జరిగిందో అందరూ చూశారు. 

ఈసారి ఎన్నికలలో తెలంగాణా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆర్.కృష్ణయ్యను తమ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సామల రవీందర్ ఈ విషయం లిఖితపూర్వకంగా తెలియజేస్తూ ఆయనకు ఒక లేఖ కూడా ఇచ్చారు. తమ పార్టీ ఈసారి 50 శాతం టికెట్లను బీసీలకే కేటాయించాలని నిర్ణయించుకొందని ఆయన తెలిపారు. కృష్ణయ్య నాయకత్వంలో ఎన్నికల బరిలో దిగుతామని చెప్పారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మొత్తం 29 మంది ముఖ్యమంత్రులు పాలించారని వారిలో ఒక్కరూ కూడా బీసీ ముఖ్యమంత్రి లేరని రవీందర్ చెప్పారు. తెలంగాణా రాష్ట్ర జనాభాలో 50 శాతంపైగా బీసీలు ఉన్నప్పటికీ వారికి రాజ్యాధికారం లభించడంలేదని, కనుక బీసీల కోసం చిరకాలంగా పోరాడుతున్న కృష్ణయ్య ద్వారా బీసీలకు న్యాయం పొందేందుకు గట్టిగా ప్రయత్నిస్తామని రవీందర్ చెప్పారు.

బీసీ జనాభా ప్రాతిపాదికన చూస్తే ఆ వర్గం చేతిలోనే పాలనా పగ్గాలు ఉండాలి. కానీ దశాబ్ధాలుగా రాజకీయాలను ఆర్ధికబలం, అంగబలం ఉన్నవారే శాశిస్తున్నందున బీసీలకు రాజ్యాధికారం లభించడం లేదు. నేటికీ అదే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈసారి కాంగ్రెస్‌-టిఆర్ఎస్‌ల మద్య జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో బీసీలతో సహా ప్రజలందరూ ఆ రెండు పార్టీల మద్యే చీలిపోతారు.  ఎందుకంటే ఆ రెండు పార్టీలు బీసీలను మేమే ఉద్దరిస్తామని పోటీలు పడుతుంటాయి. కనుక వాటి మాటలు నమ్మి బీసీలు వాటికే ఓట్లేస్తారు తప్ప 50 శాతం సీట్లు కేటాయించిన తెలంగాణా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి లేదా తమ నాయకుడు కృష్ణయ్యకు ఓట్లు వేసి గెలిపిస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని అనుకోరు. రాష్ట్రంలో రాజకీయాలను వాస్తవదృష్టితో చూస్తే ఈ వాదన నిజమని అర్ధమవుతుంది. బీసీలలో అనైక్యతే వారిని రాజ్యాధికారానికి దూరం చేస్తోందని చెప్పవచ్చు.


Related Post