టిడిపి లేదన్నప్పుడు ఇక భయం ఎందుకు? రమణ

October 04, 2018


img

సిఎం కెసిఆర్‌ నిన్న నిజామాబాద్‌ సభలో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడును, కాంగ్రెస్‌-టిడిపి కూటమిని తిట్టిపోశారు. వాటికి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ ధీటుగా బదులిచ్చారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా రాష్ట్రంలో టిడిపి ఉనికి కోల్పోయిందని చెపుతున్నప్పుడు మరి మాపార్టీని చూసి భయపడటందేనికి? మేము మా రాజకీయ అవసరాల కోసం ఏ పార్టీతో పొత్తులు పెట్టుకొంటే సిఎం కెసిఆర్‌ ఎందుకు అంత చింతిస్తున్నారు? 2009లో ఆయన మాపార్టీతోనే పొత్తులు పెట్టుకొన్న సంగతి మరిచిపోయారా? ఆనాడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ లో హైటెక్ సిటీ, సైబరాబాద్ లను ఏర్పాటు చేసి రాష్ట్రానికి గొప్ప ఆర్ధికవనరును సృష్టించి ఇస్తే, మీరు అధికారం చేపట్టిన నాలుగేళ్లలోనే ధనిక రాష్ట్రంగా చేతికి అందిన తెలంగాణా రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేయలేదా? అంటే తెలంగాణాకు ఎవరు మేలు చేశారు? ఎవరు కీడు చేస్తున్నారు? ఈ నాలుగేళ్ళలో  ఏమీ చేయకుండా మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేసినందున తెలంగాణా ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. అందుకే తొమ్మిది నెలలు ముందుగా అధికారంలో నుంచి దిగిపోయి ముందస్తు ఎన్నికలకు వెళుతున్న మీరు ఓటమి భయంతోనే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మాకు అర్ధమైంది. రాష్ట్ర ప్రజలు తమ ఆకాంక్షలను నెరవేర్చగల ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారు. కనుక మా మహాకూటమిపై మీరు ఎంతగా బురద జల్లాలని ప్రయత్నిస్తున్నప్పటికీ ఈసారి మా చేతిలో ఓటమి ఖాయం,” అని అన్నారు. 

ఏపీ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా సిఎం కెసిఆర్‌ మాటలను తప్పు పట్టారు. “సిఎం కెసిఆర్‌ తిట్ల పురాణం గురించి అందరికీ తెలిసిందే. నిత్యం ఎవరినో ఒకరిని తిడుతూనే ఉంటారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడినందున చంద్రబాబు నాయుడును తిడితే తెలంగాణా ప్రజలు కరిగిపోయి టిఆర్ఎస్‌కు ఓట్లు వేస్తారని భ్రమలో ఉన్నారు. కానీ హైదరాబాద్‌ ను అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడేనాని తెలంగాణా ప్రజలకు కూడా తెలుసు. ఈరోజు తెలంగాణా దేశంలో రెండవ ధనిక రాష్ట్రంగా నిలబడిందంటే దానికి కారణం ఆనాడు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీని నిర్మించి ఐటి  రంగాన్ని అభివృద్ధి చేయడం వలననే కదా? చంద్రబాబు నాయుడుని తిడుతున్న సిఎం కెసిఆర్‌ కేబినెట్ లో ఆయనతో సహా సగం మంది టిడిపి నేతలేనని సంగతి మరిచినట్లున్నారు. కాంగ్రెస్‌-టిడిపిలకు ఓట్లేసి మహాకూటమిని గెలిపిస్తే తెలంగాణా రాష్ట్రం డిల్లీకి, అమరావతికి గులామీ చేయాల్సివస్తుందని సిఎం కెసిఆర్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఒకవేళ కాంగ్రెస్‌-టిడిపిలు అటువంటి ప్రయత్నాలు చేస్తే తెలంగాణా ప్రజలు వాటిని తిప్పికొట్టకుండా ఊరుకొంటారా? సిఎం కెసిఆర్‌ ఇటువంటి వితండవాదనలతో ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. కానీ తన ఆశ నెరవేరుతుందో లేదోననే తీవ్ర అభద్రతాభావంతో ఉన్నారు. అందుకే నోటికి వచ్చినట్లు అందరినీ తిట్టిపోస్తున్నారు,” అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.


Related Post