సిఎంగారు ఎందుకు అంత ఆవేశపడ్డారో?

October 04, 2018


img

నిజామాబాద్‌లో నిన్న జరిగిన టిఆర్ఎస్‌ బహిరంగసభలో సిఎం కెసిఆర్‌ ప్రసంగం టిఆర్ఎస్‌ కార్యకర్తలను ఉర్రూతలూగించి ఉండవచ్చు కానీ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తన పట్ల కాంగ్రెస్‌ నేతలు అనుచితంగా మాట్లాడుతున్నారని చెపుతూ సిఎం కెసిఆర్‌ కూడా అదేవిధంగా ప్రతిపక్ష నేతలను, సాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశ్యించి తన హోదాకు తగనివిదంగా అనుచితంగా మాట్లాడారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. 

కొంగర కలాన్ లో టిఆర్ఎస్‌ ఎంతో అట్టహాసంగా నిర్వహించిన ప్రగతినివేదన సభలో తనదైన శైలిలో ప్రసంగించకపోవడంతో టిఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర నిరుత్సాహం చెందినట్లు గ్రహించిన సిఎం కెసిఆర్‌, వారిని ఉత్సాహపరిచేందుకే నిన్న తనదైన శైలిలో ప్రసంగించి ఉండవచ్చు. కానీ ఆయన ప్రతిపక్ష నేతలను ఉద్దేశ్యించి దొంగలు, సన్నాసులు, సాటి ముఖ్యమంత్రిని ఉద్దేశ్యించి రాక్షసుడు, దోపీడీదారుడు అంటూ చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేసి స్వయంగా విమర్శలపాలవుతున్నారిప్పుడు. 

ఇప్పుడు కాంగ్రెస్‌, టిడిపిలను దొంగలు, దోపిడీదారులు అభివృద్ధి నిరోదకులని తిట్టిపోస్తున్న సిఎం కెసిఆర్‌ ఒకప్పుడు అవే పార్టీలతో పొత్తులు పెట్టుకొన్నారు. అప్పుడు తప్పు కానిది ఇప్పుడు అవి పొత్తులు పెట్టుకొంటే తప్పు అనైతికం ఎలా అవుతుంది? 

ఒకప్పుడు టిఆర్ఎస్‌ ఉద్యమకారులతో నిండి ఉండేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌, టిడిపి నేతలతో నిండిపోయుంది. తెలంగాణా ద్రోహులు, ఉద్యమ ద్రోహులు, అభివృద్ధి నిరోదకులని టిఆర్ఎస్‌ నేతలు నిత్యం తిట్టిపోస్తున్న అదే కాంగ్రెస్‌, టిడిపి నేతలు నేడు సిఎం కెసిఆర్‌ చుట్టూ ఉన్నారు. ఒకపక్క నేటికీ ఆ రెండు పార్టీల నుంచి టిఆర్ఎస్‌లోకి నేతలను తెచ్చుకొంటూ వారిని పక్కనే ఉంచుకొని మరీ ఆ పార్టీలను తిట్టిపోయడం హాస్యాస్పదంగా ఉంది. 

ప్రతిపక్షాలను బలహీన పరిచేందుకు ఫిరాయింపులను ప్రోత్సహించడం, శాసనసభ రద్దు చేసేవరకు వారందరూ టిడిపి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలుగానే కొనసాగడం అనైతికం కానప్పుడు ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకొంటే అనైతికం ఎలా అవుతుంది?

మహాకూటమికి ఓటేసి గెలిపిస్తే రాష్ట్రాన్ని తెలంగాణా ప్రజల ఆత్మగౌరవాన్ని డిల్లీకి, అమరావతికి తాకట్టుపెట్టినట్లేనని టిఆర్ఎస్‌ వాదన వెనుక రాజకీయ కోణం ఉంది. తెలంగాణాలో టిఆర్ఎస్‌కు ఎదురు ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్‌, టిడిపి ఎమ్మెల్యేలను టిఆర్ఎస్‌లోకి ఫిరాయింపజేసి వాటిని బలహీనపరచాలని టిఆర్ఎస్‌ ప్రయత్నించింది. కానీ అవే పార్టీలు చేతులు కలిపి టిఆర్ఎస్‌ను డ్డీ కొనేందుకు ఇప్పుడు సిద్దం అవుతుండటంతో వాటికి చెక్ పెట్టేందుకు ‘తెలంగాణా ప్రజల ఆత్మగౌరవం’ అనే పేరుతో మళ్ళీ తెలంగాణా సెంటిమెంటును తట్టి లేపేందుకు టిఆర్ఎస్‌ ప్రయత్నిస్తోందని చెప్పవచ్చు.

టిఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీపై డిల్లీ గులాము ముద్ర, టిడిపిపై చంద్రబాబు నాయుడు గులాము ముద్ర వేసి వాటి పట్ల ప్రజలలో వ్యతిరేకత ఏర్పరిచి ఎన్నికలలో టిఆర్ఎస్‌కు ఎదురులేకుండా చేసుకోవాలనుకోవడం  గొప్ప వ్యూహమే కావచ్చు కానీ దానిని అమలుచేయడానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇటువంటి అనుచితమైన బాషను ఉపయోగించడాన్ని ఎవరూ హర్షించలేరు. 

అయినా టిఆర్ఎస్‌ 100కు పైగా సీట్లు గెలుచుకోవడం ఖాయమని, ప్రతిపక్షాలన్నీ ఏకం అయినా టిఆర్ఎస్‌ను ఏమీ చేయలేవని సిఎం కెసిఆర్‌ స్వయంగా బల్లగుద్ధి మరీ వాదిస్తున్నప్పుడు ఇక ఏ పార్టీ దేనితో పొత్తులు పెట్టుకొంటే ఏమిటి? వాటి పొత్తులను చూసి ఆయన ఇంతగా ఆందోళన చెండానికి అర్ధం ఏమిటి? 

టిఆర్ఎస్‌ అభ్యర్ధుల పనితీరు, గత నాలుగేళ్ళలో వారు తమ నియోజకవర్గాలలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యాక్రమాలు, వారికున్న ప్రజాధారణతో ఓట్లు కోరవలసి ఉండగా, వారందరినీ గెలిపించుకొనే బాధ్యత తనదేనని సిఎం కెసిఆర్‌ చెప్పుకోవడానికి అర్ధం ఏమిటి? అంటే వారి పనితీరును బట్టి గాక తన నాయకత్వాన్ని, టిఆర్ఎస్‌ జెండాను చూసి ఓట్లేయాలని ప్రజలను కోరుతున్నట్లే కదా? తెరాస నేతలు ఆత్మగౌరవం, గులామీ గురించి మాట్లాడుతున్నప్పుడు మరి దీనిని ఏమనుకోవాలి? 


Related Post