శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ ఇదేనా?

October 04, 2018


img

నటుడు శివాజీ కొంత కాలం క్రితం మీడియాతో మాట్లాడుతూ, “ప్రధాని మోడీని చంద్రబాబు నాయుడు నిలదీస్తునందున కేంద్రప్రభుత్వం ఆయనను నియంత్రించేందుకు ‘ఆపరేషన్ గరుడ’ అనే పేరుతో ఒక భారీ కుట్రకు సిద్దమయింది,” అని ప్రకటించారు. తీగ లాగితే డొంక కదులుతుందన్నట్లు చంద్రబాబు నాయుడును నియంత్రించాలంటే ఓటుకు నోటు కేసును పట్టుకొని లాగవచ్చని సామాన్య ప్రజలకు కూడా తెలుసు. ప్రస్తుతం ఐటిద అధికారులు అదే పనిమీద ఉండటం గమనిస్తే శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ ఇదేనా? అనే సందేహం కలుగకమానదు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు దీంతో సిఎం కెసిఆర్‌కు నిత్యం సవాళ్ళు విసురుతున్న రేవంత్ రెడ్డిని, ప్రధాని మోడీకి సవాళ్ళు విసురుతున్న చంద్రబాబు నాయుడును ఇద్దరినీ కట్టడి చేయవచ్చునని వేరే చెప్పనవసరం లేదు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డిని ఈ కేసుతో దెబ్బ తీయగలిగితే ఆ ప్రభావం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీపై కూడా పడుతుంది. అంటే ఒకే దెబ్బకు రెండు కాదు...మూడు పిట్టలు కొట్టవచ్చన్న మాట! 

ఐటిడ అధికారులు నిన్న రేవంత్ రెడ్డిని మధ్యాహ్నం 11.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విచారణ చేసినప్పుడు వారు ప్రధానంగా ఓటుకు నోటు కేసులో రూ.50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? దానిని ఎవరు ఆయన చేతికి ఇచ్చారు? అనే పాయింట్ చుట్టూనే ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. అయితే ఆ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది కనుక దాని గురించి మాట్లాడలేనని రేవంత్ రెడ్డి సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డిని మళ్ళీ ఈ నెల 23వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలని చెప్పినట్లు సమాచారం. 


Related Post