హమ్మయ్య! ఓ పనైపోయింది

October 03, 2018


img

కాంగ్రెస్‌ నేతృత్వంలో మహాకూటమి కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ కూర్పుపై గత నాలుగు రోజులుగా కాంగ్రెస్‌, టిడిపి, టిజెఎస్, సిపిఐ నేతల మద్య జరుగుతున్న చర్చలు నేటితో విజయవంతంగా ముగిసాయి. హోటల్ గోల్కొండలో జరిగిన ఈ సమావేశం కాంగ్రెస్‌ తరపున భట్టి విక్రమార్క, టిడిపి తరపున రావుల చంద్రశేఖర్, సిపిఐ తరపున కూననేని సాంబశివరావు, తెలంగాణా జనసమితి తరపున దిలీప్ కుమార్ హాజరయ్యారు. సమావేశం అనంతరం వారు మీడియా ప్రతినిధులకు మహాకూటమి అజెండాలో ముఖ్యాంశాలను వివరించారు. 

1. విద్యా, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగం, ఉపాధికి తొలి ప్రాధాన్యత. 

2. అధికారంలోకి వచ్చిన మొదటి సం.లోనే లక్ష ఉద్యోగాల కల్పన.

3. ఉద్యోగ నియామకాలకు నిర్ణీత కేలెండర్ ఏర్పాటు.  

4. రైతులకు ఒకేసారి రూ.2 లక్షల పంట రుణాలు మాఫీ.

5. సాగునీటి ప్రాజెక్టులన్నిటిపై పునః సమీక్షించి ప్రాజెక్టులలో అవినీతిపై విచారణ జరపడం.

6. రాష్ట్రంలో ప్రతీ పెద కుటుంబానికి ఒక ఇల్లు. 

అన్ని పార్టీలకు ఒకే ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించుకోవడం కొంచెం కష్టమే కావచ్చు. కానీ సీట్ల సర్దుబాట్లతో పోలిస్తే అంత కష్టం కాదనే చెప్పవచ్చు. ఎన్నికలలో వాగ్ధానలు చేయడం కూడా సులువే కానీ గెలిస్తే వాటిని అమలు చేయడమే కష్టం. కనుక మహాకూటమిలో మొదట సీట్ల సర్ధుబాట్లు చేసుకోవడం, ఆ తరువాత తమ మ్యానిఫెస్టోతో ప్రజలను మెప్పించడం, ఎన్నికలలో గెలవడం, గెలిస్తే ఈ హామీలను అమలు చేయడం ప్రతీది చాలా కష్టమే. కనుక మహాకూటమి ఎంతదూరం పయనిస్తుందో చూడాలి.


Related Post