టిఆర్ఎస్‌ సర్కారుకు ఈసీ షాక్

October 03, 2018


img

టిఆర్ఎస్‌ సర్కారుకు కేంద్ర ఎన్నికల కమీషన్ ఈరోజు ఒక షాక్ ఇచ్చింది. ఈ నెల 12 నుంచి రాష్ట్రంలో అర్హులైన మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొన్న తరువాత రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున చీరల పంపిణీ చేయరాదని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ఓటర్లను ప్రభావితం చేయగల ఇటువంటి కార్యక్రమాలు చేపట్టరాదని స్పష్టం చేసింది. 

రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కూడా బతుకమ్మ చీరల పంపిణీ చేసింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ ఇది పాతపధకమే కనుక ఈసారి కూడా చీరల పంపిణీకి అనుమతిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావించి రూ.280 కోట్ల వ్యయంతో 95 లక్షల చీరలను సిద్దం చేయిస్తోంది. వాటిలో సుమారు 50 లక్షల చీరలు ఇప్పటికే జిల్లాలకు చేరాయి. ఈ నెల 12 నుంచి వాటిని పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తుంటే, ఎన్నికల కమీషన్ వాటిని పంపిణీ చేయరాదని తేల్చి చెప్పడంతో వాటన్నిటినీ ఇప్పుడు ఏమి చేయాలో ప్రభుత్వానికి పాలుపోవడం లేదు. 

గత ఏడాది సుమారు రూ. 200 కోట్లు వ్యయంతో పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు చాలా నాసిరకంగా ఉండటంతో మహిళలు వాటిని రోడ్లపై పోసి నిప్పు పెట్టి తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది బతుకమ్మ చీరలకు ఎన్నికలు అడ్డొచ్చాయి. చూడబోతే టిఆర్ఎస్‌ సర్కారుకు బతుకమ్మ చీరల పంపిణీ అచ్చొచ్చినట్లు లేదు. ఎన్నికలు ముగిసేవరకు 95 లక్షల చీరలను భద్రపరచడం పెద్ద సమస్యే. అలాగని ఎన్నికల కమీషన్ ఆదేశాలను ధిక్కరించి పంపిణీ చేయలేదు కనుక వాటి పంపిణీకి ప్రత్యామ్నాయ మార్గం కనుగొనక తప్పదు. 

కొన్ని వందల రూపాయలు ఖరీదు చేసే బతుకమ్మ చీరల పంపిణీకే ఎన్నికల కమీషన్ అభ్యంతరం చెప్పినప్పుడు నాలుగువేల రూపాయల విలువగల రైతు బంధు చెక్కుల పంపిణీకి, ఐదారు లక్షల విలువ చేసే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు పంపిణీకి అంగీకరిస్తుందనుకోలేము. కెసిఆర్‌ ఎంతో దూరదృష్టితో ఆలోచించి ఈ పధకాలు ప్రారంభిస్తే చివరి నిమిషంలో ఈసీ వాటిని తుస్సు మానిపించేసింది.


Related Post