కాంగ్రెస్‌-టిడిపి రాష్ట్రానికి శాపం: కెసిఆర్‌

October 03, 2018


img

ఈరోజు నిజామాబాద్‌లో జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సిఎం కెసిఆర్‌ చాలా తీవ్ర స్థాయిలో కాంగ్రెస్‌, టిడిపి, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులపై విరుచుకుపడ్డారు. “కాంగ్రెస్ పార్టీ ఒకపక్క తెలంగాణా అభివృద్ధిని అడుగడుగునా అడ్డుపడుతూ, తెలంగాణాను అస్థిరపరచాలని కుట్రలు పన్నుతున్న చంద్రబాబు నాయుడుతో నిసిగ్గుగా చేతులు కలుపుతోంది. అనేక ఏళ్ళు కోట్లాడి, వందలమంది యువకులు బలిదానాలు చేసుకొని తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకొన్నది మళ్ళీ చంద్రబాబు నాయుడు చేతికి అప్పగించడానికా? రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు అధికార యావ తప్ప రాష్ట్రం గురించి చింత ఉండదా? అధికారం కోసం ఎవరితోనైనా చేతులు కలుపుతారా? 

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు కడుతుంటే అడ్డుకోలేకపోయింది. కానీ మా పార్టీ అధికారంలోకి వచ్చేక అదే మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టు నిర్మిస్తున్నాము. టిఆర్ఎస్‌ ఎప్పుడూ రాష్ట్రాభివృద్ధి గురించే ఆలోచిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పదవులు, అధికారం గురించి మాత్రమే ఆలోచిస్తుంటుంది. కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌ల మద్య ఉండే తేడా ఇదే. 

ఇక రాష్ట్రంలో బిజెపి ఉందో లేదో తెలియని పరిస్థితి. గత ఎన్నికలలో బిజెపిని గెలిపిస్తే విదేశాలలో ఉన్న నల్లధనం అంతా తెచ్చి దేశంలో పేదలకు పంచి పెడతానని నరేంద్ర మోడీ ప్రజలను మభ్య పెట్టారు. కానీ ఏమి చేశారు? రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ అధికారం చేజిక్కించుకోవడం కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి. వాటికి తగిన విధంగా బుద్ది చెప్పాలని నేను ప్రజలను కోరుతున్నాను. తెలంగాణా రాష్ట్రం ఇదే వేగంతో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి దేశంలో నెంబర్:1 స్థానంలో నిలవాలంటే మళ్ళీ టిఆర్ఎస్‌నే గెలిపించాలని కోరుతున్నాను,” అని సిఎం కెసిఆర్‌ అన్నారు.


Related Post