మహాకూటమి చర్చలు కొలిక్కి వచ్చేనా?

October 03, 2018


img

కాంగ్రెస్‌, టిడిపి, టిజెఎస్, సిపిఐల నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్ రమణ, ప్రొఫెసర్ కోదండరామ్, చాడా వెంకట రెడ్డి హైదరాబాద్‌లోని హోటల్ గోల్కొండలో ప్రస్తుతం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో వారు కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ పై చర్చిస్తున్నారు. అయితే ఆ నాలుగు పార్టీల మద్య అసలు సమస్య  సీట్ల సర్దుబాట్లని అందరికీ తెలుసు. సీట్ల సర్ధుబాటుపై పరస్పరం ఒక అంగీకారానికి రాకుండా నాలుగు పార్టీలు కలిసి ఏవిధంగా పనిచేయాలి? తమ లక్ష్యాలు ఏమిటి? అని మాట్లాడుకొంటున్నాయంటే నమ్మశక్యంగా లేదు. కానీ ఈరోజు జరుగుతున్న సమావేశంలో కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ పై చర్చలు ఒక కొలిక్కి వస్తాయని మహాకూటమి నేతలు చెపుతున్నారు. 

ఒకవేళ వాటిమద్య సీట్ల సర్దుబాటుపై ఒప్పందం కుదిరితే, సమావేశం తరువాత ఏ పార్టీకి ఎన్ని సీట్లు? అనే దానిపై వారు నిర్ధిష్టమైన ప్రకటన చేయవచ్చు. లేకుంటే మరోసారి సమావేశమయ్యి చర్చించుకోవాలని నిర్ణయించుకొన్నామని చెప్పవచ్చు. ఆలోగా మహాకూటమిలో చేరడానికి ఇష్టపడని పార్టీలు దానికి గుడ్ బై చెప్పేసి తమ దారి తాను చూసుకోవచ్చు. 

టిడిపి, సిపిఐ పార్టీలు కాంగ్రెస్‌ ఇచ్చే సీట్లతో సర్దుకుపోవచ్చునాని తెలుస్తోంది కానీ కనీసం 25 సీట్లు ఆశిస్తున్న తెలంగాణా జనసమితి కాంగ్రెస్‌ ఆఫర్ చేస్తున్న 3 సీట్లకు అంగీకరించకపోవచ్చు కనుక అది మహాకూటమి నుంచి బయటకు వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తోంది. అది బయటకు వస్తే దానితో పొత్తులు పెట్టుకోవాలని బిజెపి ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఒకవేళ టిఆర్ఎస్‌ వాదిస్తున్నట్లు తెలంగాణా జనసమితి మూడు సీట్లతో సర్ధుకుపోతే మహాకూటమి సిద్దం అయినట్లే భావించవచ్చు. మరికాసేపట్లో మహాకూటమి పరిస్థితిపై మరింత స్పష్టత రావచ్చు.


Related Post