కాంగ్రెస్‌-బిజెపి-టిఆర్ఎస్‌ రాజకీయ చదరంగం

October 03, 2018


img

రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది కనుక కాంగ్రెస్‌-బిజెపి-టిఆర్ఎస్‌ పార్టీలు రాజకీయ చదరంగం మొదలుపెట్టేశాయి. కాంగ్రెస్‌, టిడిపి, టిజెఎస్, సిపిఐలది అనైతిక, జుగుప్సాకరమైన పొత్తులని టిఆర్ఎస్‌ వాదిస్తుంది. కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పడుతున్న మహాకూటమికి ఓటేస్తే, అటు డిల్లీకి, అమరావతికి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లేనని టిఆర్ఎస్‌ వాదిస్తుంది. రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న కాంగ్రెస్‌, టిడిపిలతో తెలంగాణా కోసం పోరాడిన కోదండరామ్ పొత్తులకు సిద్దపడటం జుగుప్సాకరం అని విమర్శిస్తుంది. మహాకూటమికి ఓటేసి అవినీతిమాయమైన కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే ఈ నాలుగేళ్ళలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని, తెలంగాణా పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుందని టిఆర్ఎస్‌ వాదన.  

టిఆర్ఎస్‌ ఒకవైపు మజ్లీస్ పార్టీతో బహిరంగంగా మరోపక్క దానిని తీవ్రంగా ద్వేషించే బిజెపితో రహస్యంగా స్నేహం కొనసాగిస్తోందని కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాలు విమర్శిస్తుంటాయి. టిఆర్ఎస్‌కు ఓటేస్తే మోడీకి ఓటేసినట్లేనని, టిఆర్ఎస్‌, మజ్లీస్, బిజెపి పార్టీలు కలిసి రాష్ట్రంలో ముస్లింలను, గిరిజనులను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్‌ వాదిస్తోంది. కేంద్రం మెడలు వంచి జోనల్ వ్యవస్థకు ఆమోదముద్ర వేయించుకొన్నామని గొప్పలు చెపుతున్న టిఆర్ఎస్‌ నేతలు, అదేవిధంగా కేంద్రం మెడలు వంచి గిరిజనులకు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఎందుకు కల్పించలేకపోయారని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పి మోసం చేసినా టిఆర్ఎస్‌తో మజ్లీస్ పార్టీ ఇంకా ఎందుకు కలిసి సాగుతోందని ప్రశ్నిస్తున్నారు. 

టిఆర్ఎస్‌-మజ్లీస్ పొత్తులను బిజెపి తప్పు పడుతుంది. మజ్లీస్ అధినేతల కనుసన్నలలో పనిచేసే టిఆర్ఎస్‌కు ఓటేస్తే మజ్లీస్ పార్టీకి ఓటేసినట్లేనని బిజెపి వాదిస్తుంటుంది. కాంగ్రెస్‌ నేతృత్వంలో మహాకూటమి ఒక అపవిత్ర, అనైతిక కూటమి అని, అధికార దాహంతో ఏర్పడిన దానికి ఓటేసి గెలిపిస్తే రాష్ట్రం కుక్కలు చించిన విస్తరిలా మారుతుందని బిజెపి వాదన. 

ఈవిధంగా అన్ని పార్టీలు ఏదో ఒక పార్టీతో బహిరంగంగానో, రహస్యంగానో పొత్తులు పెట్టుకొంటూనే ప్రత్యర్ధులు పొత్తులు పెట్టుకొంటే అవి అనైతికం, అపవిత్రం అంటూ తమ కోణంలో నుంచి ఏవో కారణాలు చూపుతున్నాయి. వాటి వాదనలను పక్కనపెడితే, ఇప్పుడు ఏ పార్టీకి ఓటేస్తే అవి భవిష్యత్తులో దేనితో కలిసి పనిచేస్తాయనే దానిపై స్పష్టత వచ్చేసింది. కనుక తెలంగాణా ప్రజలు విజ్నతతో ఆలోచించి రాష్ట్రానికి ఎక్కువ మేలు చేయగల పార్టీకి ఓటు వేసి గెలిపించుకోవలసి ఉంటుంది.


Related Post