ఈసారి అమిత్ షా ఏమి చెపుతారో?

October 03, 2018


img

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సెప్టెంబరు 15న మహబూబ్ నగర్ లో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మళ్ళీ నెల రోజులు తిరక్కుండానే అక్టోబర్ 10న కరీంనగర్ లో బిజెపి నిర్వహించబోయే ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు వస్తున్నారు. మొదటిసారి వచ్చినప్పుడు ఆయన సిఎం కెసిఆర్‌ను ఉద్దేశ్యించి, ‘మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మద్య గల సత్సంబంధాలను బిజెపి-టిఆర్ఎస్‌ అనుబందంగా చూడరాదని చెప్పారు. రాష్ట్రంలో టిఆర్ఎస్‌ను బిజెపి గట్టిగా ఎదుర్కొని పోరాడుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్...దాని అధ్యక్షుడు రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. 

ఈ నెలరోజులలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలో మహాకూటమి ఏర్పాటు, టిఆర్ఎస్‌లో అసమ్మతి సెగలు వంటి   అనేక రాజకీయ పరిణామాలు జరిగాయి. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు త్వరలో సోనియా గాంధీని రాష్ట్రానికి రప్పించి భారీ బహిరంగ సభ నిర్వహింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు కనుక అమిత్ షా కరీంనగర్ బహిరంగసభలో ఈ పరిణామాలన్నిటిపై స్పందించవచ్చు. 

అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అమిత్ షా, బిజెపి కేంద్రమంత్రులు తెలంగాణాలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు వారు జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావించి పరస్పరం విమర్శలు చేసుకోవచ్చు. వారు దానికే పరిమితమయితే, వారి ఎన్నికల ప్రచారం వలన టిఆర్ఎస్‌కు ఎటువంటి నష్టమూ ఉండబోదని చెప్పవచ్చు. కానీ వారు టిఆర్ఎస్‌ సర్కార్ పాలన, అవినీతి, రాష్ట్ర స్థాయి సమస్యలపై ఎక్కువగా మాట్లాడితే టిఆర్ఎస్‌ వారిని గట్టిగా ఎదుర్కోక తప్పదు. కనుక ఈసారి బహిరంగసభలో అమిత్ షా ఏమి మాట్లాడుతారో చూడాలి.


Related Post