సిట్టింగులపై వ్యతిరేకత సహజం: రాజయ్య

October 02, 2018


img

స్టేషన్‌ఘన్‌పూర్‌ టిఆర్ఎస్‌ అభ్యర్ధి టి రాజయ్యను స్థానిక టిఆర్ఎస్‌ నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతో వారితో మంత్రి కేటీఆర్‌ సుదీర్ఘంగా చర్చించి వారి అభ్యంతరాలను అడిగి తెలుసుకొన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌తో సహా అన్ని నియోజకవర్గాలలో అనేకమార్లు సర్వేలు చేయించి, స్థానిక పరిస్థితులను, రాజకీయ బలాబలాను అన్నిటినీ అంచనా వేసిన తరువాతే సిఎం కెసిఆర్‌ అభ్యర్ధులను ఖరారు చేశారని కనుక ఎవరినీ మార్చే ప్రసక్తి లేదని మంత్రి కేటీఆర్‌ వారికి స్పష్టం చేశారని రాజయ్య మీడియాకు చెప్పారు. 

అన్ని నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసమ్మతి సహజమని, అంతమాత్రన్న ప్రకటించిన అభ్యర్ధులను మార్చితే తేనె తుట్టెను కడిపినట్లే అవుతుందని అన్నారు. గత నాలుగేళ్ళలో తనతో కలిసి పనిచేసి, తన ద్వారా అనేక పనులు చేయించుకొన్న టిఆర్ఎస్‌ నేతలు ఇప్పుడు తనపై అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని రాజయ్య అన్నారు. పార్టీలో ఉండాలనుకొనే వారందరూ పార్టీ అధిష్టానం మాట జవ దాటరాదని, క్రమశిక్షణతో మెలిగిన్నట్లయితే వారికి పార్టీలో తప్పకుండా తగిన గుర్తింపు అవకాశాలు లభిస్తాయని రాజయ్య అన్నారు. పార్టీ క్రమశిక్షణను అతిక్రమించినవారి సంగతి పార్టీ అధిష్టానమే చూసుకొంటుందని అన్నారు. 

తనను వ్యతిరేకిస్తునవారితో కూడా మాట్లాడి అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని, ఒకవేళ ఏవైనా లోపాలున్నట్లయితే సరిదిద్దుకొంటానని రాజయ్య అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి తానే పోటీ చేస్తానని, అధిష్టానం ఆశీస్సులు తనకే ఉన్నాయని రాజయ్య చెప్పారు. 

రాజయ్య చెప్పినదానిని బట్టి అసమ్మతినేతలను మంత్రి కేటీఆర్‌ నయాన్నో, భయన్నో బుజ్జగించి చల్లబరిచినట్లే ఉంది. వారు చల్లబడ్డారో లేదో త్వరలోనే తెలుస్తుంది. 


Related Post