గులాబీ ముళ్ళు గుచ్చుకొంటున్నాయి

October 01, 2018


img

గులాబీ పార్టీలో అసమ్మతి సెగలు ఇంకా పూర్తిగా చల్లారలేదు. హుజూర్ నగర్ లో టికెట్ ఆశిస్తున్న శంకరమ్మ, సైదిరెడ్డి, సాముల శివారెడ్డి పట్టణంలో వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈసారి తమకే టికెట్ తప్పకుండా లభిస్తుందని ఎవరికివారు చెప్పుకొంటున్నారు. దాంతో టిఆర్ఎస్‌ కార్యకర్తలు కూడా మూడు వర్గాలుగా చీలిపోయారు. ముగ్గిరిలో ఎవరికి టికెట్ ప్రకటించినా మిగిలిన ఇద్దరూ అసంతృప్తి చెందడం సహజం. ఆ ముగ్గురికి కాకుండా వేరెవరికి కేటాయించినా వారు ముగ్గురితో పార్టీకి సమస్య తప్పదు.  

ఇక స్టేషన్‌ఘన్‌పూర్‌ టిఆర్ఎస్‌ అభ్యర్ధి రాజయ్యను మార్చాలంటూ స్థానిక టిఆర్ఎస్‌ నేతల ఒత్తిడి ఎంతగా ఉందంటే వారీనందరినీ మంత్రి కేటీఆర్‌ ఈరోజు హైదరాబాద్‌ రప్పించుకొని వారితో భేటీ కావలసివచ్చింది. కేటీఆర్‌ నచ్చజెప్పిన చెప్పిన తరువాతైనా వారు తమ పట్టు సడలిస్తారో లేదో రేపు తెలియవచ్చు. 

ఇక నాగార్జున సాగర్ టిఆర్ఎస్‌ అభ్యర్ధి నోముల నరసింహయ్యకు స్థానిక టిఆర్ఎస్‌ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత  ఎదుర్కోవలసివస్తోంది. టికెట్ ఆశిస్తున్న ఎం.సి.కోటిరెడ్డి స్థానికుడైన తనను కాదని బయటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం సరికాదని, దాని వలన టిఆర్ఎస్‌కు దక్కవలసిన సీటు కాంగ్రెస్‌ సీనియర్ నేత జానారెడ్డి ఎగురేసుకు వెళ్ళిపోతారని వాదిస్తున్నారు. జానారెడ్డిని డ్డీకొని ఓడించాలంటే తన వంటి బలమైన స్థానికుడికే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ తనకు టికెట్ కేటాయించకపోతే స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయడానికి వెనుకాడబోనని చెపుతున్నారు. టిఆర్ఎస్‌లో మిగిలిన 14 సీట్లకు అభ్యర్ధుల జాబితా ఇంకా విడుదల కావలసి ఉంది. అప్పుడు ఇంకా ఎంత మంది అసమ్మతి రాగాలాపన చేస్తారో చూడాలి. 


Related Post