విజయశాంతి నిర్ణయం సరైనదేనా?

October 01, 2018


img

తెలంగాణా కాంగ్రెస్‌ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి సోమవారం ఒక అనూహ్యమైన ప్రకటన చేశారు. ఈసారి ఎన్నికలలో తాను పోటీ చేయనని కేవలం ప్రచారానికే పరిమితం అవుతానని చెప్పారు. ఈసారి జరుగబోయే శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. ఎన్నికల ప్రచార కమిటీ షెడ్యూల్ ఖరారు చేయగానే రాష్ట్ర వ్యాప్తంగా 430 మండలాలలో పర్యటించి ఎన్నికల ప్రచారం మొదలుపెడతానని విజయశాంతి చెప్పారు.

విజయశాంతి మళ్ళీ చాలా కాలం తరువాత సిఎం కెసిఆర్‌పై విమర్శలు గుప్పించారు. తెలంగాణా ఇస్తే టిఆర్ఎస్‌ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తానని సోనియా గాంధీ కాళ్లపై పడి ప్రాధేయపడిన కెసిఆర్‌, అధికారంలోకి వచ్చేక ఇప్పుడు నెహ్రూ కుటుంబాన్నే విమర్శిస్తూ చాలా అహంభావంతో విర్రవీగుతున్నారని, ఆయన అహంభావాన్ని ప్రజలు గమనిస్తున్నారని విజయశాంతి అన్నారు.

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయలేని వ్యక్తి కాంగ్రెస్‌ మెడలు వంచి తెలంగాణా సాధించానని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని విజయశాంతి అన్నారు. కేటీఆర్‌, కవితల రాజకీయ భవిష్యత్ కు తాను అవరోధంగా కనిపించినందునే కెసిఆర్‌ తనను టిఆర్ఎస్‌ నుంచి బహిష్కరించారని భావిస్తున్నానని విజయశాంతి చెప్పారు. 

గతంలో ఎంపీగా ఉన్న విజయశాంతి మళ్ళీ ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నందునే శాసనసభ ఎన్నికలలో పోటీ చేయకూడదని నిర్ణయించుకొని ఉండవచ్చు. కానీ ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి కూడా విజయావకాశాలు కనిపిస్తున్నప్పుడు, ఆమె శాసనసభకు పోటీ చేయకపోవడం సరైన నిర్ణయం కాదనే చెప్పవచ్చు. ఆమె వంటి ప్రజాధారణ ఉన్న వ్యక్తి పోటీ చేయడం వలన కాంగ్రెస్‌ పార్టీ ఒక ఎమ్మెల్యే సీటు సునాయాసంగా గెలుచుకోగలుగుతుంది కదా? 

ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలిచి, లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఓడిపోయినట్లయితే, ఆమె లోక్‌సభ ఎన్నికలలో గెలిచినా పెద్దగా ఉపయోగం ఉండదు. అదే శాసనసభకు పోటీ చేసి గెలిస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఓడిపోయినా ఎమ్మెల్యేగా ఆమె తన శక్తి సామర్ధ్యాలను సభలో, బయటా చాటుకొనే అవకాశం ఉంటుంది. అంతగా కావాలనుకొంటే తరువాత జరిగే లోక్‌సభ ఎన్నికలలో కూడా పోటీ చేయవచ్చు కానీ శాసనసభకు పోటీ చేసే అవకాశాన్ని వదులుకోవడం సరైన నిర్ణయం కాదనే చెప్పవచ్చు.


Related Post