టిఆర్ఎస్‌ 100 సీట్లు గెలుచుకోగలదా?

October 01, 2018


img

సుమారు ఏడాదిన్నర క్రితం నుంచే సిఎం కెసిఆర్‌ తెలంగాణా శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా టిఆర్ఎస్‌ 100 సీట్లకు పైగా గెలుచుకోవడం ఖాయమని పదేపదే చెపుతున్నారు. తాను చేయించిన ప్రతీ సర్వేలో ఇదే నిర్ధారణ అయ్యిందని చెపుతున్నారు.  చెప్పడమే కాదు మొదటి జాబితాలోనే 105 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించి తన వాదనకు బలం చేకూర్చారు. అభ్యర్ధుల పేర్లను ప్రకటించిన తరువాత టిఆర్ఎస్‌లో కొంత అసమ్మతిసెగలు రగులుకొన్నప్పటికీ, అవి మరీ ఇబ్బందికర స్థాయిలో లేవనే చెప్పవచ్చు. ఇక ఎన్నికల కమీషన్ కూడా సిఎం కెసిఆర్‌ చెప్పిన సమయంలోనే ఎన్నికలు జరిపించడానికి శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. కనుక అన్ని టిఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నట్లే కనిపిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో వాస్తవ రాజకీయ బలాబలాలను, సమీకరణాలను, రాజకీయ పరిస్థితులను గమనిస్తే టిఆర్ఎస్‌ 100 సీట్లు గెలుచుకోగలదా? అని ఆలోచించవలసిన అవసరం కనిపిస్తోంది. 

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా దంపతులు, నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించుకొంటామని గట్టి భరోసా ఇస్తున్నారు. ఇక పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, డికె అరుణ, గీతారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, జైపాల్ రెడ్డి వంటి 10-15 గెలుపుగుర్రాలున్నాయి. ఇక కాంగ్రెస్‌, టిడిపి, టిజెఎస్, సిపిఐల పొత్తులు కుదిరినా కుదరకపోయినా, కోదండరామ్, ఎల్ రమణ వంటి వివిద పార్టీల నేతలు మరో 6-10 మంది వరకు ఉండవచ్చు. అలాగే బిజెపిలో కె లక్ష్మణ్, కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ వంటి హేమాహేమీలున్నారు. కనుక ప్రతిపక్షాలలో ఇటువంటి ముఖ్యనేతలందరినీ కలుపుకొని చూస్తే వారు సుమారు 40 మంది వరకు కనిపిస్తున్నారు. ఆ లెక్కన చూస్తే సిఎం కెసిఆర్‌ చెపుతున్నట్లుగా టిఆర్ఎస్‌ 100 సీట్లు గెలుచుకోవడం కష్టమే. టిఆర్ఎస్‌ 100 సీట్లు గెలుచుకోవాలంటే టిఆర్ఎస్‌ ప్రభంజనం సృష్టించగలిగితేనే 100 సీట్లు గెలుచుకోవడం సాధ్యం అవుతుంది. అది ఎలా సృష్టించాలో సిఎం కెసిఆర్‌కు బాగా తెలుసు.


Related Post